Telangana State Election Commission: మోగిన నగారా..గ్రామాల్లో పంచాయతీ వార్‌

తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల నగారా మోగింది. రేపు అంటే గురువారం నవంబరు 27న ప్రారంభమయ్యే సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ.. డిసెంబర్‌ 17 నాటికి పూర్తవుతుంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేశారు.

New Update
Local Body Elections

Local Body Elections

Telangana State Election Commission: తెలంగాణలో ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న గ్రామపంచాయతీ ఎన్నికల నగారా మోగింది. రేపు అంటే గురువారం నవంబరు 27న ప్రారంభమయ్యే సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ.. డిసెంబర్‌ 17 నాటికి పూర్తవుతుంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 12,728 సర్పంచ్‌ స్థానాలకు, 1,12,242 వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం 3 విడతల్లో ఎన్నికలు చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. పోలింగ్‌ పూర్తయిన తర్వాత.. అదేరోజు ఓట్ల లెక్కింపు జరిపి, ఫలితాలను ప్రకటిస్తామని తెలిపింది. డిసెంబరు 11, 14, 17 తేదీల్లో పోలింగ్‌ ఉంటుందని.. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ నిర్వహించి, మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ అధికారులు తెలిపారు. అదే సమయంలో ఉపసర్పంచ్‌ ఎన్నిక ప్రక్రియను సంబంధిత విభాగాలు పూర్తిచేస్తాయని వెల్లడించారు. ప్రభుత్వం జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ఆధారంగా.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారు చేసినట్లు ఎస్‌ఈసీ అధికారులు స్పష్టం చేశారు.

అదే సమయంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో.. తక్షణమే రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈసీఐ అందజేసిన ఓటరు జాబితా ఆధారంగా తుదిఓటరు జాబితాను గ్రామపంచాయతీ, వార్డుల వారిగా ఇప్పటికే సిద్ధం చేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని వివరించారు.మూడు విడతల్లో చేపట్టే ఈ ఎన్నికలకు సంబంధించి.. నోటిఫికేషన్‌ జారీచేసే రోజు నుంచే ఆ విడత ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరిస్తామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశామని.. ఎక్కడా అడ్డంకులు లేకుండా గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించానున్నామన్నారు..  ఈ విషయమై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటామని రాణి కుముదిని స్పష్టం చేశారు.

 మూడు విడతల్లో ఎన్నికలు

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,728 సర్పంచ్‌ స్థానాలు, 1,12,288 వార్డులు ఉన్నాయి.. తొలివిడతలో డిసెంబర్‌ 11న 4,236 సర్పంచ్‌, 37,440 వార్డుసభ్యుల స్థానాలకు.. రెండోవిడతలో భాగంగా డిసెంబరు 14న 4,333 సర్పంచ్‌, 33,350 వార్డుసభ్యుల స్థానాలకు.. మూడోవిడతలో 4,159 సర్పంచ్‌, 36,452 వార్డుసభ్యుల స్థానాలకు డిసెంబర్‌ 17న పోలింగ్‌ జరుగుతుంది. సర్పంచ్‌ ఎన్నికలకోసం 15,522.. వార్డుసభ్యుల కోసం 1,12,474 పోలింగ్‌ స్టేషన్లను ఎంపిక చేశాయి. కాగా ఈ ఎన్నికలు పార్టీరహితంగా చేపడతారన్న విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం.. సంబంధిత ఎన్నికల సామగ్రిని ఇప్పటికే సిద్ధం చేసింది.  గ్రామ పంచాయతీల పరిధిలో పోటీచేసే అభ్యర్థులకు కేటాయించాల్సిన గుర్తులను, బ్యాలెట్‌ పత్రాలను కూడా ఇప్పటికే ముద్రించింది. స్థానికంగా వచ్చే నామినేషన్ల ఆధారంగా ఆయా గుర్తులను అభ్యర్థులకు కేటాయించడానికి సన్నహాలు చేస్తున్నారు.

 గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని 1,66,55,186 మంది గ్రామీణ ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఉన్నారు. మొత్తం ఓటర్లలో పురుషులు 81,52,231 మంది ఉండగా.. మహిళలు 85,12,455 మంది, ఇతరులు 500 మంది ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) సిద్ధం చేసిన ఓటర్ల తుదిజాబితా ఆధారంగా.. గ్రామపంచాయతీ, వార్డులవారీగా డీపీవోలు, ఎంపీడీవోల ద్వారా పరిశీలన జరిపి.. సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా ఓటరు జాబితాను వెల్లడించింది.

ఎంతమంది పిల్లులున్నా..ఒకే..

ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలుంటే..స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులు అనే నిభంధన చాలా కాలంగా అమల్లో ఉంది. అయితే ప్రస్తుతం ఈ నిబంధనను తొలగించారు. రాష్ట్రప్రభుత్వం జారీచేసిన జీవో ప్రకారం ఈసారి స్థానికసంస్థల ఎన్నికలతోపాటు, ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లోనూ ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నవారు కూడా పోటీచేసేందుకు అవకాశం ఉంది.  గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ప్రభుత్వం ఖరారుచేసిన ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లపై కొంత భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు న్యాయపరమైన చిక్కుల నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సర్పంచ్‌ స్థానాలకు సంబంధించి ఆర్‌డీవో, డీపీవోలు.. వార్డుసభ్యులకు సంబంధించి ఎంపీడీవోలు రిజర్వేషన్లను ఖరారుచేశారు. అయితే ఆయా జిల్లాల్లో జనాభాకు అనుగుణంగా.. బీసీ వర్గాలకు ఒక్కో చోట ఒక్కో విధంగా రిజర్వేషన్లు కల్పించినప్పటికీ.. బీసీలకు మొత్తంగా 17శాతం మాత్రమే రిజర్వేషన్లు దక్కాయని రాజకీయ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో.. 25శాతం, మరికొన్ని చోట్ల 23శాతం బీసీ రిజర్వేషన్లను కల్పించినట్లు బీసీవర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీదా చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న సర్పంచ్‌ ఎన్నికలకు ఎట్టకేలకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.

Advertisment
తాజా కథనాలు