Temples: తెరుచుకున్న ఆలయాలు..పోటెత్తిన భక్తులు

సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం మూత పడిన పలు దేవాలయాలు సోమవారం తెరుచుకున్నాయి. గ్రహణ సమయం ముగిసిన  తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు తెరుచుకున్నాయి. దీంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున భక్తులు రావడంతో సందడి నెలకొంది.

New Update
temple

Open temples..throng devotees

Temples:  సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం మూత పడిన పలు దేవాలయాలు సోమవారం తెరుచుకున్నాయి. గ్రహణ సమయం ముగిసిన  తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు తెరుచుకున్నాయి. దీంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలను దర్శించుకోవడంతో సందడి నెలకొంది. నిన్నంతా నిర్మానుషంగా ఉన్న ఆలయాలు తిరిగి కళకళలాడుతున్నాయి.

 తిరుమలలో చంద్ర గ్రహణం తర్వాత ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం చేశారు. వేకువజామున 2.40 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు తెరిచారు. ఏకంతంగా సుప్రభాత సేవను అర్చకులు నిర్వహించారు. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. 18 కంపార్టెమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక శ్రీశైలం మల్లన్న ఆలయంలో చంద్రగ్రహణం అనంతరం సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. ఉదయం 5 గంటలకు మల్లన్న ఆలయ ద్వారాలను అధికారులు తెరిచారు. ఆలయ శుద్ధి తర్వాత అర్చకులు ప్రాతఃకాల పూజలు నిర్వహించారు. ఉదయం 7.30 గంటల తర్వాత భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనాలకు అవకాశం ఇచ్చారు.

సింహాచల దేవస్థానంలో ని  శ్రీవరాహ లక్ష్మీనరసింహ స్వామికి చంద్రగ్రహణం అనంతరం సంప్రోక్షణ పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి భక్తుల దర్శనాలకు అనుమతి ఇచ్చారు. విశాఖలోని బురుజు పేట శ్రీకనక మహాలక్ష్మి ఆలయంలో సంప్రోక్షణ పూర్తి చేశారు. అనంతరం ఉదయం 9 గంటల నుంచి దర్శనాలకు అవకాశం ఇచ్చారు. ఇక యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని అధికారులు తెరిచారు. తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచి అర్చకులు సంప్రోక్షణ చేశారు. స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహించి యథావిధిగా స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై  కొలువై ఉన్న కనకదుర్గ దేవి ఆలయంలో ఉదయం 8.30 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చారు. సంప్రోక్షణ, పూజల తర్వాత అమ్మవారి దర్శనానికి అనుమతి ఇచ్చారు. దీంతో భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు.
బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంతో పాటు ఉప ఆలయాల్లో  కవాటోద్ఘాటనం గణపతి పూజ నిర్వహించారు. వేకువజాము నుంచి మహా సంప్రోక్షణ, ఆలయ శుద్ధి కార్యక్రమం చేశారు. అనంతరం  అమ్మవారికి సుప్రభాతం, విశేష అభిషేకం, మహా నివేదన నీరాజనం, మహా మంత్రపుష్ప సమర్పణ నిర్వహించారు. ఆలయంలో యథావిధిగా తిరిగి అక్షరాభ్యాసాలు, ఆర్జిత సేవలు మొదలయ్యాయి.

చంద్రగ్రహణం ముగిసినందున భద్రాద్రి రామాలయం తలుపులు తెరుచుకున్నాయి. తెల్లవారుజామున 3 గంటలకు రామాలయం తలుపులు తెరుచుకున్నాయి. సుప్రభాత సేవ తర్వాత ఆలయాన్ని గోదావరి జలాలతో అర్చకులు శుద్ధి చేశారు. అనంతరం ప్రధానాలయంలో సీతారాముల మూలమూర్తులకు అభిషేకం చేశారు. స్వామివారికి మహానివేదన నిర్వహించిన తర్వాత ఉదయం 7.30 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహా సంప్రోక్షణ, ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలోనూ మహా సంప్రోక్షణ, ఆలయ శుద్ధి కార్యక్రమం పూర్తి చేశారు. భక్తులు పెద్ద ఎత్తున హజరయై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Also Read : khalistan: ఖలిస్తానీ ఉగ్ర గ్రూపులకు తమ నుంచే నిధులు..అంగీకరించిన కెనడా

Advertisment
తాజా కథనాలు