/rtv/media/media_files/2025/08/13/sigachi-industries-2025-08-13-12-03-32.jpg)
Sigachi Industries
Sigachi Explosion: పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో జూన్ 30న జరిగిన ప్రమాదంలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే. పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి 41 మంది చనిపోవడంతో పాటు 35 మంది తీవ్ర గాయపడ్డారు. అయితే ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదానికి కారణాలను అన్వేషించడానికి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా కమిటీ జూలై5న తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. అయితే ఈ నివేదికలో ప్రమాదానికి పూర్తి బాధ్యత కంపెనీ యాజమాన్యానిదే అని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.ప్రమాదకర పరిశ్రమ అని తెలిసినా కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరించారని నివేదిక వెల్లడించింది.
టీజీఐఐసీ, కాలుష్య నియంత్రణ మండలి, పోలీసు, పరిశ్రమలు, అగ్నిమాపక శాఖ, వైద్యఆరోగ్యం, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలు తదితర సంస్థలు జరిపిన విచారణను పరిగణలోకి తీసుకున్న విచారణ కమిటీ ప్రమాద కారణాలను తన నివేదికలో వెల్లడించింది. సిగాచీ కంపెనీ ఔషధ తయారీల్లో ఉపయోగించే మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ (ఎంసీసీ)ను తయారుచేస్తోంది. ఈ పరిశ్రమ అత్యంత కాలుష్య పరిశ్రమ కావడంతో కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం దీన్ని రెడ్ క్యాటగిరీలో చేర్చింది. కేవలం కాలుష్యం మాత్రమే కాక ప్రమాదాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉన్న పరిశ్రమగా దీన్ని పరిగనిస్తారు. అలాంటి పరిశ్రమ లో భద్రతా చర్యలు తీసుకోవడంలో కంపెనీ యాజమాన్యం పూర్తిగా విఫలమైందని ఆ నివేదికలో పేర్కొన్నారు.
Also Read: అమెరికాలో ఇంటిపై పడిన ఉల్క.. షాకింగ్ విషయాలు వెల్లడించిన సైంటిస్టులు!
మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ (ఎంసీసీ) తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎంసీసీ తయారి కోసం చెక్క గుజ్జును 120 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద రియాక్టర్‌లో వేడి చేశాక ఫిల్టర్ చేస్తారు. ఆ తర్వాత 80ు నీటితో స్లర్రీగా మారుస్తారు. దీన్ని అటామైజర్ ద్వారా స్ర్పే డ్రయర్‌కు పంపుతారు. దాన్ని హాట్ ఎయిర్ జనరేటర్‌తో ఉత్పత్తి చేసిన వేడి గాలిని డ్రయర్‌లోకి పంపుతారు. ఇక్కడ 205 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఎంసీసీ తయారీ ప్రక్రియలో డ్రయర్ పాత్ర అత్యంత కీలకం. అలాంటి ప్రమాదకర యంత్రాల వద్ద అనుభవం, నిపుణత, సుశిక్షితులైన వారు పనిచేయాల్సి ఉంటుంది. కానీ, యాజమాన్యం ఇవేవీ పట్టించుకోలేదు.
అత్యంత కీలకమైన డ్రయర్‌ను12 ఏళ్ల క్రితం గుజరాత్ నుంచి తెప్పించారు. నేటికి ఆ డ్రయర్‌నే ఉపయోగిస్తున్నారు. దాని నిర్వహణను కూడా కంపెనీ యజమాన్యం గాలికి వదిలేసింది. దీంతో అది పేలింది. ఇది పేలడం వల్లే ప్రమాదం జరిగింది. మండే స్వభావమున్న ముడిసరుకు పెద్ద మొత్తంలో ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. పేలుడును నిరోధించే వెంట్‌లుకానీ, భద్రతా వాల్వ్‌లు కానీ అక్కడ లేవు. పాత డ్రయర్ కావడం, కొన్ని చోట్ల తుప్పు పట్టినా పట్టించుకోకపోవడం వంటి లోపాల మూలంగా డ్రయర్ పేలడానికి కారణమైంది. రెడ్ క్యాటగిరీ పరిశ్రమ అయినప్పటికీ సిగాచీ సంస్థ.. అగ్నిమాపక శాఖ నుంచి ఎలాంటి భద్రత పరమైన అంశాలకు సంబంధించి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ) తీసుకోలేదు. కనీస భద్రతా ప్రమాణాలూ పాటించలేదు. అంతేకాదు1991లో పాశమైలారం పంచాయతీ నుంచి భవన ప్రణాళికకు సంబంధించి ఆమోదం పొందిన కంపెనీ.. ఆ తర్వాత మళ్లీ ఎన్నడూ కూడా దాన్ని రెన్యూవల్ చేయించలేదు. మళ్లీ భవన ప్రణాళిక ఆమోదం తీసుకోలేదని విచారణ కమిటీ తన నివేదికలో పొందుపరిచింది.
రెడ్ క్యాటగిరి పరిశ్రమ అయినప్పటికీ నిపుణులైన సిబ్బందిని నియమించుకోలేదు. కంపెనీలో పనిచేస్తున్న వారిలో ఎవరికీ శిక్షణ ఇవ్వలేదు. పనిచేసే కార్మికులకు భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉండగా. కనీసం ఆ దిశగా ప్రయత్నమూ చేయలేదు. ప్రమాద జరిగిన సమయంలో 125 మంది ఉండగా వారిలో 30 మంది రోజువారీ పనులు చేసే తాత్కాలిక కార్మికులున్నారు. వారిలో ఈఎఎస్‌ఐ ప్రయోజనం లభించే వారు కూడా తక్కువే. అంతేకాక మరణించిన వారిలో 10 మందికి కంపెనీ ఎలాంటి బీమా ప్రయోజనం ఇవ్వలేదు. రెడ్ క్యాటగిరి పరిశ్రమలో ఎల్లప్పుడూ అంబులెన్స్ అందుబాటులో ఉండాలి. కానీ, అదేం లేదు.ప్రమాదం జరిగితే తీసుకోవలసిన చర్యలపై అక్కడి సిబ్బందికి ఎలాంటి అవగాహన కూడా కలిపించకపోవడం గమనార్హం. కాగా నివేదిక ప్రభుత్వం చేతికి చేరినప్పటికీ దీనిపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది వివరించలేదు. మృతుల కుటుంబాల్లో ఎంతమందికి నష్టపరిహారం అందించారనే వివరాలను సైతం ప్రభుత్వం ఇంతవరకు వెల్లడించకపోవడం గమనార్హం.
Also Read : వంగా మామూలుగా లేదు.. 'స్పిరిట్' ఫస్ట్ షెడ్యూల్ అక్కడ ప్లానింగ్!