Singareni: సింగరేణికి కొత్త సీఎండీ! పోటీలో పలువురు తెలంగాణ ఐఏఎస్ లు

తెలంగాణ కొంగుబంగారం సింగరేణి సంస్థకు ప్రభుత్వం త్వరలో  కొత్త ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ)ని నియమించనుంది. ప్రస్తుతం ఇన్‌ఛార్జి సీఎండీగా ఉన్న బలరాం డిప్యుటేషన్‌ గడువు ముగియడంతో ఆయన స్థానంలో రెగ్యులర్‌ సీఎండీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

New Update
SINGARENI

Singareni

Singareni:  తెలంగాణ కొంగుబంగారం సింగరేణి సంస్థకు ప్రభుత్వం త్వరలో  కొత్త ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ)ని నియమించనుంది.  ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ప్రస్తుతం ఇన్‌ఛార్జి సీఎండీగా ఉన్న బలరాం డిప్యుటేషన్‌ గడువు ముగియడంతో.. ఆయన స్థానంలో రెగ్యులర్‌ సీఎండీని నియమించాలని ప్రభుత్వం  నిర్ణయించింది. కేంద్ర రెవెన్యూ సర్వీసు నుంచి డిప్యుటేషన్‌పై తెలంగాణకు వచ్చిన బలరాం.. సింగరేణిలో సంచాలకుడిగా, ఇన్‌ఛార్జి సీఎండీగా ఆయన ఆరేళ్ల పాటు పనిచేశారు. నిజానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన అధికారులకు డిప్యుటేషన్‌ గడువు ఐదేళ్లు మాత్రమే ఉంటుంది. అంతకుమించి.. మరో ఏడాది అదనంగా ఉన్నందున ఆయనకు మరోసారి గడువు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రాన్ని కోరలేదు. ఆయన స్థానంలో తెలంగాణకు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ లేదా ఐపీఎస్‌ అధికారిని నియమించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కాగా తెలంగాణలో అతిపెద్ధ ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో పాటు అత్యధిక లాభాలతో నడుస్తున్న సింగరేణి సీఎండీ పోస్టుపై పలువురు సీనియర్‌ అధికారులు ఆసక్తి చూపుతున్నారు.
 
ప్రస్తుతం సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదక విషయంలో లాభాల్లో ఉన్నప్పటికీ సింగరేణి ఆర్థికంగా సంకట పరిస్థితులను ఎదుర్కొంటోంది. డిస్కంల నుంచి రూ.23 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఈ విషయాన్ని ఇటీవల ప్రభుత్వానికిచ్చిన నివేదికలో సంస్థ తెలిపింది. ఉద్యోగుల జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులకు నెలనెలా బ్యాంకుల నుంచి ‘ఓవర్‌డ్రాఫ్ట్‌’(ఓడీ)పై డబ్బు తీసుకుని సర్దుబాటుచేయాల్సిన పరిస్థితి నెలకొన్నదని సంస్థ అధికారులు తలలు పట్టుకుంటున్నారని సమాచారం. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ పలు రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అప్పులు తెచ్చి కొత్తగా రూ.11 వేల కోట్ల వ్యయంతో మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో 800 మెగావాట్ల థర్మల్‌ ప్లాంటు నిర్మాణం చేపట్టింది. ఒడిశాలోని నైనీ గని వద్ద కొత్తగా బొగ్గు తవ్వకాలు ప్రారంభించింది. దానికి సమీపంలోనే రూ.25 వేల కోట్ల వ్యయంతో 1600 మెగావాట్ల థర్మల్‌ కేంద్రం నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దీంతో పాటు కొత్తగా కేంద్రం వేలం వేయబోతున్న బొగ్గు గనుల వేలంలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సింగరేణికి అనుమతి ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో రెగ్యులర్‌ సీఎండీ నియామకం కీలకమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అనుభవం ఉన్న, సమర్థ అధికారిని నియమించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది.

Advertisment
తాజా కథనాలు