/rtv/media/media_files/2024/11/12/GEQo80NtVG28Q9oiFd7Z.jpg)
కాంగ్రెస్ పార్టీ కంచుకోట నల్గొండా జిల్లాలో ఆధిపత్య పోరు మరోసారి తారాస్థాయికి చేరుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డీసీసీ అధ్యక్షుడిని పక్కన పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పిందే వేదం, చేసేదే శాసనంగా ఉందట. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో నల్గొండ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. మొదట నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. అయితే గుమ్మల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. కానీ ఇదే కార్యక్రమంలో ఉన్న డీసీసీ అధ్యక్షుడిని మంత్రి అస్సలు పట్టించుకోలేదు. అంతేకాదు ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీలలో కూడా కైలాష్ నేత ఫోటో వేయకపోవడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయాలతో సంబంధంలేకుండా ఆ జిల్లా మంత్రి పార్టీని గుప్పిట్లో పెట్టుకున్నాడట. ఏదేమైనా నల్గొండ కాంగ్రెస్‌లో నేనే రాజు, నేను మంత్రి అంటున్నాడట కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అంతెందుకు జిల్లాలో పార్టీ ఆఫీస్‌కు బదులుగా అన్ని కార్యక్రమాలకు మంత్రి క్యాంప్ ఆఫీస్సే కేర్ ఆఫ్ అడ్రస్ అట.
ఇప్పుడు నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పిందే వేదం అన్నట్టుగా సీన్ ఉందట. అసలు నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆఫిషియల్‌గా పార్టీ ఆఫీసే లేదట. నల్గొండలో ఎవరైనా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కార్యక్రమం నిర్వహించాల్సి వస్తే.. మంత్రి క్యాంపు ఆఫీసు నుంచి చేయాల్సి వస్తుందట. మరోవైపు గతంలోనూ నల్గొండ ఎంపీగా పనిచేసిన ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా ఈ అనుభవం ఎదురైందట. నల్గొండలో ఎంపీ హోదాలో క్యాంపు ఆఫీసు తెరిచేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తే.. దాన్ని కోమటిరెడ్డి పూర్తిగా అడ్డుకున్నారట. దాంతో ఉత్తమ్ కుమార్ నల్గొండలో తన ఆఫీసు తెరవకుండానే.. సైలెంట్ అయ్యారట. ప్రస్తుతం నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డిది కూడా ఇదే పరిస్థితి అట. నల్గొండలో ఎంపీ రఘువీర్ రెడ్డికి కూడా పార్టీ క్యాంపు ఆఫీసు లేకుండా పోయిందట. అయితే ఎంపీ హోదాలో ఏదైనా కార్యక్రమం చేయాల్సి వస్తే.. మంత్రి క్యాంపు ఆఫీసుకు వెళ్లి కార్యక్రమం నిర్వహించుకోవాల్సి వస్తోందట. ఇప్పుడు నల్గొండలో ఆయన క్యాంపు ఆఫీసు తెరిచే ప్రయత్నంలో ఉన్న ఆయనకు మాత్రం.. మంత్రి అనుచరులు.. గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం కూడా చర్చనీయాంశం అవుతోంది. అయితే నల్గొండలో తాను ఉండగా.. మరొకరు పార్టీ ఆఫీసు తెరవడాన్ని మంత్రి అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది.
ఇటీవల నల్గొండ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ ఎంపిక కాంగ్రెస్ వర్గవిభేదాలను బయటపెట్టింది. డీసీసీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ నేతను ఎంపిక చేయడాన్ని మంత్రి కోమటిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కైలాష్ నేతను అర్జంట్‌గా పదవి నుంచి తప్పించి సస్పెండ్ చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. అంతేకాకుండా నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. ఆయనే డీసీసీ అధ్యక్షుడిని నియమించినట్లుగా తేల్చేసి.. తక్షణమే తొలగించాలని లేఖ రాయడం తీవ్ర దుమారమే రేపింది. అయితే డీసీసీ ప్రెసిడెంట్ పున్నా కైలాష్‌కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అండ ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన పున్నా కైలాష్ నేతది పద్మశాలి సామాజిక వర్గం. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. మునుగోడు టిక్కెట్ కోసం బీసీ కోటాలో ప్రయత్నించారు. కానీ అవకాశం దొరకలేదు. భువనగిరి ఎంపీ టిక్కెట్ కోసం ప్రయత్నించారు. కానీ చాన్స్ రాలేదు. చివరకు మునుగోడు అభ్యర్ధిగా రంగంలోకి దిగిన రాజ్ గోపాల్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఊరూరా తిరుగుతూ రాజ్ గోపాల్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు. అయితే కైలాష్ నేతది మునుగోడు నియోజకవర్గం కావడం, తన గెలుపు కోసం కష్టపడుతుండటంతో రాజ్ గోపాల్ రెడ్డి కూడా మంచి పదవి ఇస్తానని గతంలో హామీ ఇచ్చారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదం కూడా కైలాష్‌కు ఉండటంతో ఆయనకు డీసీసీ పదవి దక్కింది.
కానీ.. డీసీసీ ప్రెసిడెంట్‌గా పున్నా కైలాష్ ఎంపిక మంత్రికి ఆగ్రహం తెప్పించిందట. ఎందుకంటే గతంలో పున్నా కైలాష్ నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కోమటిరెడ్డి కుటుంబంపైన వ్యక్తిగత దూషణలు చేశారు. పదవుల కోసం కుటుంబం అంతా బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యిందని విమర్శలు గుప్పించారు. దాంతో అందుకే కోమటిరెడ్డి ఆ పదవి నుంచి ఆయన్ను తప్పించాలని డిమాండ్ సైతం చేశారు. అంతేకాకుండా కైలాశ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డికి మంత్రి లేఖ లేఖ రాశారు. మరోవైపు నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్‌గా కైలాష్ నేత నియామకంపై జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక అనుచరుడు గుమ్ముల మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం ఉండటం వల్ల పటేల్ రమేష్ రెడ్డికి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించిందని, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డిలు ఎంపీలయ్యారని ఆరోపించారు. తాను రేవంత్ రెడ్డి అనుచరుడిని అయితే తాను కూడా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ అయ్యేవాడినని ఆయన వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో తనకున్న అనుబంధం డీసీసీ అధ్యక్షుడు కూడా కాకుండా చేసిందని ఆవేదన చెందాడు. తన సీనియారిటీని, పార్టీకి చేసిన సేవను విస్మరించారని ఆరోపించారు.
మొత్తంమీద డీసీసీ అధ్యక్షుడితోనూ మంత్రి వెంకట్ రెడ్డికి అస్సలు పడటం లేదు. దాంతో డీసీసీని మంత్రి వెంకట్ రెడ్డి పూర్తిగా పక్కన పెట్టేశారు. పున్నా కైలాష్ నేతను డీసీసీగా మంత్రి గుర్తించడం లేదు. దాంతో డీసీసీ అధ్యక్షుడి వర్సెస్ మంత్రి అన్నట్టుగా సీన్ మారుతోంది. అయితే ఈ విషయంలో మంత్రి వెంకట్ రెడ్డి తీరుపై జిల్లా నేతలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. మంత్రి మాత్రం.. తన అడ్డాలో ఫర్మిషన్ లేకుండా ఎవరు ఏమీ చేసినా అంగీకరించడం లేదని అంటున్నారు.. ఏదీఏమైనా నల్గొండ మంత్రి వెంకట్ రెడ్డి వ్యవహారం మాత్రం.. కాంగ్రెస్ వర్గాలను షాక్ కు గురిచేస్తోంది.
Follow Us