Kavitha: బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కక్షగట్టి రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తమ కార్యకర్తలను వేధిస్తే ఇకపై ఊరుకోబోమంటూ హెచ్చరించారు. కేసులకు వ్యతిరేకంగా కొట్లాడడానికి పార్టీ పరంగా లీగల్ టీమ్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో నిజాలను ప్రచారం చేసినా, ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపినా కాంగ్రెస్ ప్రభుత్వం సహించడం లేదన్నారు. ఈ మేరకు సోమవారం కోరుట్ల నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎన్ని విమర్శలు చేసినా ఈ రకంగా వ్యవహరించలేదని గుర్తు చేశారు.
తిట్లు ఏరులై పారుతున్నాయి..
ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా పోటీపడి తిట్లు తిడుతున్నారు. కేసీఆర్ పాలనలో నిధులు వరదలయ్యి పారేవి.. ఇప్పుడు రాష్ట్రంలో తిట్లు ఏరులై పారుతున్నాయి. కేసీఆర్ మొక్క అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి.. కేసీఆర్ ఒక వేగుచుక్క. రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్. తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎన్నో కష్టాలకోర్చి పనిచేసిన చరిత్ర ఉంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ తట్టుకొని నిలబడింది. ఇప్పుడు కూడా అదే స్పూర్తిగా పనిచేద్దామంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీ జీఎస్టీని విధించడం దౌర్భాగ్యం..
ఇక కష్టకాలంలో పార్టీ కోసం పని చేసే వారే నిజమైన కార్యకర్తలని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని కార్యకర్తలకు ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను, హామీలను విస్మరించిన తీరును ప్రజల్లో ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. మోదీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ విధించడం దౌర్భాగ్యం బ్రిటీష్ పాలనలో కూడా లేని చేనేతపై పన్నును ప్రధాని మోదీ జీఎస్టీని విధించడం దౌర్భాగ్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో కలిశారు. కులగణనపై బీసీ డెడికేటెడ్ కమిషన్ కు నివేదిక అందించినందుకు ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఇది కూడా చదవండి: Gayatri: హమాలీ బిడ్డకు జడ్జి హోదా.. గాయత్రి విజయ ప్రస్థానమిదే!
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ తరఫున చేనేతపై జీఎస్టీని రీయింబర్స్ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించడం శోచనీయమని విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేనేతపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని రియింబర్స్ చేయాలని డిమాండ్ చేశారు. అఖిల భారత పద్మశాలి సంఘ జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి, అఖిలభారత పద్మశాలి సంఘం రాజకీయ జాతీయ అధ్యక్షుడు బొల్లా శివశంకర్, తెలంగాణ పద్మశాలి సంఘ మహిళా అధ్యక్షురాలు గుంటక రూపక, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు గుర్రం శ్రవణ్, తెలంగాణ పద్మశాన సంఘ రాజకీయ విబాగా ప్రధాన కార్యదర్శి కు బొమ్మ ప్రవళిక, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జిల్లా నరేందర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు చిట్టిపోలు గణేష్, రాష్ట్ర పద్మశాలి సంఘం యూత్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఫస్ట్ సినిమానే పట్టాలెక్కలేదు.. అప్పుడే రెండో సినిమాకు సైన్ చేసిన మోక్షజ్ఞ