/rtv/media/media_files/2025/08/30/mla-komatireddy-rajgopal-reddy-2025-08-30-11-18-02.jpeg)
MLA Komatireddy Rajgopal Reddy
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం అసెంబ్లీకి సమావేశాలకు హాజరైయ్యే ముందు ఆయన గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లారు. భారీగా కార్యకర్తలు, మద్దతుదారులతో మునుగోడు నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. అమరవీరులకు శద్ధాంజలి ఘటించిన తర్వాత రాజ్ గోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
వరదలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతూ కష్టాల్లో అసెంబ్లీకి రావడం ఇష్టం లేదని ఆయన అన్నారు. మొదటి రోజు రాజగోపాల్ రెడ్డి భారీగా మద్దతుదారులతో అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ రోజు(శనివారం) మాత్రమే అసెంబ్లీకి వస్తానని ఆయన స్పష్టం చేశారు. రేపటి నుంచి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తానని రాజ్‌గోపాల్ రెడ్డి చెప్పారు. మెదక్, కామారెడ్డి వరద బాధితులకు అండగా ఉంటానని ఆయన ప్రకటించారు. అసెంబ్లీలో ఇదే నా చివరిరోజన ఆయన తెలిపారు. ఇక నుంచి ప్రజల్లోనే ఉంటానని రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని.. కామారెడ్డి, మెదక్ జిల్లాలో పర్యటిస్తానని రాజ్ గోపాల్ రెడ్డి ప్రకటించారు. ఇక అటు అసెంబ్లీ ప్రారంభం కాగానే దివంగత నేత మాగంటి గోపినాథ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
అధిష్టానంపై అసంతృత్తితో రాజ్ గోపాల్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి తీవ్రస్థాయికి చేరింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మంత్రి పదవి దక్కకపోవడంపై ఆయన తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ అసంతృప్తి కారణంగా ఆయన పలు సందర్భాల్లో సొంత ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మునుగోడు ఎమ్మెల్యేగా తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశించారు. అయితే, ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కకపోవడంతో అసంతృప్తి పెరిగిపోయింది. గతంలో బీజేపీలో చేరి, మళ్లీ కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చినప్పుడు, పార్టీ అధిష్టానం ఆయనకు మంత్రి పదవిని హామీ ఇచ్చినట్లు రాజగోపాల్ రెడ్డి పలుమార్లు పేర్కొన్నారు. ఈ హామీని నెరవేర్చకపోవడంతో ఆయన పార్టీ నాయకత్వంపై తీవ్రంగా నిలదీస్తున్నారు. దీంతో అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం క్లియర్ చేయట్లేదని, మునుగోడు నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పకుండా, "ప్రభుత్వ పదవులు తీసుకున్నవారు నిధులు కూడా తీసుకుంటున్నారా" అంటూ పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాజగోపాల్ రెడ్డి విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా స్పందించారు. "ఒకే కుర్చీలో పది మంది కూర్చోవాలనుకుంటారు, అందులో తొమ్మిది మందికి నిరాశే మిగులుతుంది" అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి చేసినట్లు రాజకీయ వర్గాలు భావించాయి.