/rtv/media/media_files/2025/10/29/maoist-leaders-chandranna-and-bandi-prakash-2025-10-29-07-42-47.jpg)
Maoist leaders Chandranna and Bandi Prakash surrender
Maoist Party : మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కేంద్ర స్థాయి నేతలతో సహా వందలాది మంది మావోయిస్టులు లొంగుబాట పడుతున్నారు. తాజాగా కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ శంకరన్న అలియాస్ చంద్రన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ అలియాస్ బండి దాదా తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయిన విషయం తెలిసిందే. నాలుగు దశాబ్ధాలకు పైగా అజ్ఞాతంలో గడపిన ఈ నేతలిద్దరూ లొంగిపోవడం పార్టీకి తీవ్ర నష్టమేనని చెప్పవచ్చు. అయితే తమది లొంగుబాటు కాదని మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాటం వనం వీడి జనంలోకి వచ్చామని తెలిపారు. ఒకసారి వారి నేపథ్యంలోకి తొంగిచూస్తే...
పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న..
పెద్దపల్లి జిల్లా వడ్కాపూర్ గ్రామానికి చెందిన పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న అలియాస్ శంకరన్నది 45 ఏండ్ల అజ్ఞాతజీవితం. వారి తండ్రి పుల్లూరి శ్రీనివాసరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి వరలక్ష్మి. ఆ దంపతులకు ప్రసాదరావు రెండో సంతానం. 1961లో జన్మించిన ప్రసాదరావు1979లో పెద్దపల్లి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్(ఆర్‌ఎస్‌యూ)తో పరిచయాలు ఏర్పడ్డాయి. అప్పటి ఆర్‌ఎస్‌యూ ఆర్గనైజర్ అయిన దగ్గు రాజలింగుతో కలిసి ఆయన పనిచేశారు. అదే క్రమంలో నాటి పీపుల్స్‌వార్ సీనియర్ నేత పెద్దపల్లికి చెందిన కిషన్‌జీకి కొరియర్‌గా పనిచేశారు.
అనంతరం హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో పనిచేస్తున్న నాటి పీపుల్స్‌వార్ అగ్రనేత కొండపల్లి సీతారామయ్య వర్గానికి చెందిన నాయకులకు కొరియర్‌గా ఉంటూ వారికి సమాచారాన్ని అందించడంలో ప్రసాదరావు కీలకపాత్ర పోషించారు. 1981లో పీపుల్స్‌వార్ కేఎస్ వర్గం ఇతర రాష్ట్రాల్లోని మార్క్సిస్టు, లెనినిస్టు గ్రూపులతో విలీనమై.. సీపీఐ(ఎంల్) -పీపుల్స్‌వార్‌గా ఏర్పడింది. ఆ
సమయంలో చంద్రన్న సిర్పూర్, చెన్నూరు దళాల్లో పనిచేశారు.1995లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత పార్టీకి చెందిన ఫ్రంటల్ ఆర్గనైజేషన్లను సమన్వయం చేసుకుంటూ, నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర కమిటీగా మారిన తర్వాత పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా కార్యకలాపాలు నిర్వహించారు.
సింగరేణి కార్మిక సమాఖ్య నుంచి..
మరో మావోయిస్టు నేత బండి ప్రకాశ్ స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. సింగరేణి కార్మికుడు అయిన బండి రామారావు, అమృతమ్మకు రెండో సంతానం. 1982-84 మధ్య ఆర్‌ఎస్‌యూ పరిచయంతో అందులో చేరాడు. అదే సమయంలో పీపుల్స్‌వార్‌కు అనుబంధంగా సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) ఆవిర్భవించింది. దీంతో ఆయన తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రెస్‌టీం ఇన్‌చార్జిగా, సింగరేణి కోల్‌బెల్ట్ కమిటీ బాధ్యుడిగా మావోయిస్టు పార్టీలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. 1984లో పుల్లూరి ప్రసాదరావు ద్వారా సిర్పూర్ సాయుధ దళంలో చేరారు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఇంటికి చేరుకున్నప్పటికీ 1984లో జరిగిన ఏఐటీయూసీ నాయకుడు వీటీ అబ్రహం హత్యకేసులో నిందితుడిగా ఉన్నాడు. అప్పుడు అరెస్ట్ అయిన ప్రకాశ్ ఇతర నేతలతో కలిసి జైలు నుంచి తప్పించుకుని పారిపోయాడు.
ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తాం.
అయితే అనారోగ్య సమస్యల కారణంగా లొంగిపోయిన ప్రసాదరావు, బండి ప్రకాశ్ తమది లొంగుబాటు కాదని, మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వచ్చామని చెప్పడం గమనార్హం. 45 ఏళ్లు జనం కోసం వనంలో పనిచేసిన తాము ఇకపై జనంలోనే ఉండి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అనారోగ్య సమస్యలతో తాము బయటకు వచ్చామని వివరించారు. మావోయిస్టు పార్టీ భావజాలాన్ని ఓడించడం ఎవరి తరమూ కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి నష్టాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. తమ సిద్ధాంతం ఓడిపోలేదని, మళ్లీ జనంలో పుట్టుకొస్తుందని వ్యాఖ్యనించారు. పార్టీలో అంతర్గత చీలిక వచ్చిందని, ఆయుధాలతో లొంగిపోవాలని కొందరు, ఆయుధాలు వదిలి బయటకు వెళదామని మరికొందరు నిర్ణయించుకున్నారన్నారు. ఇందులో తమ పార్టీ ప్రస్తుత కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ పక్షానే తాము ఉంటామని, ఆయనకే తమ మద్దతు ఉంటుందని తేల్చి చెప్పడం సంచలనంగా మారింది. ఇటీవల ఆయుధాలతో లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న విధానాలకు తాము వ్యతిరేకమన్నారు. కొద్ది రోజుల్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మావోయిస్టు పార్టీలో జరిగిన అంతర్మథనాన్ని ప్రజలకు వివరిస్తామని వివరించారు.
Follow Us