కేటీఆర్, సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపాయి. ఆమె వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున, నాగచైతన్య, సమంత కూడా ఖండించారు. మరోవైపు కేటీఆర్ కూడా కొండా సురేఖ మాటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లీగల్ నోటీసును పంపించారు. కేవలం రాజకీయ కక్షతోనే, రాజకీయాల ప్రయోజనం కోసమే తన పేరును వాడుకుంటున్నారని అన్నారు. ఒక మహిళ అయి ఉండి ఇంకో మహిళ పేరును, సినిమా పేరును వాడుకొన వారి వ్యక్తిక్త హనానికి పాల్పడటం దురదృష్టకరమన్నారు. అసలు తనకు సంబంధమే లేని ఫోన్ ట్యాపింగ్, ఇతర అంశాలపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యపూరితమని లీగల్ నోటీసులో పేర్కొన్నారు.
Also Read: కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సమంత.. ఏమన్నారంటే ?
ఎలాంటి సాక్షాలు లేకుండానే కొండా సురేఖ చేసిన అసత్యపూరిత వ్యాఖ్యలు.. మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయని అన్నారు. ఒక మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడు అని సోయి లేకుండా సురేఖ ఇలా మాట్లాడటం ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు. గతంలో కూడా ఇలాంటి అడ్డగోలు మాటలు మాట్లాడిన ఆమెకు ఈ ఏడాది నాలుగో నెలలో కూడా నోటీసులు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆమె కావాలనే పదేపదే అబద్ధాలు చెబుతూ.. తన వ్యక్తిత్వాన్ని తగ్గించడం కోసం, నష్టపరచడం కోసం చేస్తోందని పేర్కొన్నారు.
కొండా సురేఖ వెంటనే తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. భవిష్యత్తులో ఇలా చిల్లర మాటలు మాట్లాడవద్దని సూచించారు. 24 గంటల్లోగా కొండా సురేఖ క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసులను కూడా వేస్తానని హెచ్చరించారు. ఇదిలాఉండగా కొండా సురేఖ.. సమంత, నాగచైతన్య విడిపోవడానికి కేటీఆరే కారణమన్నారు. నాగార్జునాకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చకూడదంటే సమంతను కేటీఆర్ తన వద్దకు రావాలని అడిగాడని చెప్పారు. సమంత దీనికి అంగీకరించకపోవడంతో నాగార్జున ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మనాడని.. అందుకే విడాకులు జరిగాయంటూ వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు మీడియాలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.