Formula E car race : ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసులో కీలక పరిణామం..వారి ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ -కార్‌ రేస్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌ కుమార్‌ ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే కేటీఆర్ ప్రొసిక్యూషన్‌కు గవర్నర్ నుంచి అనుమతి లభించిన విషయం తెలిసిందే.

New Update
FotoJet (10)

Hyderabad Formula E Car Race Case

Formula E car race : గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులకు, అధికారులకు వరుస టెన్షన్‌లు తప్పడం లేదు.రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ -కార్‌ రేస్‌ కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ2 గా ఉన్న ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌ కుమార్‌ ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ప్రొసిక్యూషన్‌కు కూడా గవర్నర్ నుంచి అనుమతి లభించిన విషయం తెలిసిందే. రాజకీయ నాయకులు, అధికారుల ప్రాసిక్యూషన్‌కు అనుమతి లభించడంతో ఏసీబీ అధికారులు ఛార్జిషీట్‌ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు.

 కాగా హైదరాబాద్‌లో  బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో 2023లో నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్‌ కోసం విదేశీ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని వల్ల ప్రభుత్వానికి రూ.54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. అయితే నాడు పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌ మంత్రి హోదాలో ఆదేశించడంతోనే తాము నిధులు విడుదల చేసినట్లు అప్పట్లో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అర్వింద్‌కుమార్‌ ఇదివరకే ప్రభుత్వానికి లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చారు. అంతేకాక ఏసీబీ విచారణలోనూ ఈ విషయాన్ని అంగీకరించారు. 
 
ఇక తాజా అనుమతితో ఈ కేసు విచారణ మరింత వేగంగా జరగనుంది. ఫార్ములా-ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే తుది నివేదికను కూడా  సిద్ధం చేశారు. ఈ నివేదికలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కేసులో ఏ1 మాజీ మంత్రి కేటీఆర్‌, ఏ2 ఐఏఎస్ అధికారి అరవింద్‌, ఏ3 BLN రెడ్డి, ఏ4, ఏ5లుగా FEO ప్రతినిధులను తుది నివేదికలో చేర్చారు. ఈ సందర్భంగా ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వహించాలన్నది కేటీఆర్ సొంత నిర్ణయమని నివేదికలో స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ అనుమతులు లేకుండానే రేస్ నిర్వహించినట్లు ఆరోపించారు. ఇందులో క్విడ్ ప్రో కో జరిగిందని వివరించారు. దీనిద్వారా బీఆర్ఎస్‌కు రూ.44 కోట్ల ఎలక్ట్రోరల్‌ బాండ్లు అందాయని తుది నివేదికలో పేర్కొన్నారు. ట్రైపార్టీ అగ్రిమెంట్‌కు ముందే బీఆర్ఎస్‌కి ఈ-బాండ్లు చెల్లించారని నివేదికలో వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు