KCR : అందెశ్రీ మరణం పట్ల సీఎం రేవంత్, కేసీఆర్ సంతాపం

అందెశ్రీ అకాల మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని కేసీఆర్ అన్నారు.

New Update
cm revanth reddy

తెలంగాణ సాహితీ శిఖరం, ప్రజల కవి అందెశ్రీ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను కలిగించిందని, ఆయన మరణం సాహితీ లోకానికే కాదు వ్యక్తిగతంగా తనకు తీరని లోటన్నారు సీఎం రేవంత్.  తెలంగాణ ఉద్యమంలో తన అక్షరాన్ని ఇంధనంగా మార్చి ప్రజల్లో నిత్య చైతన్యాన్ని జ్వలింపచేసిన గొప్ప యోధుడు అందెశ్రీ అని గుర్తు చేసుకున్నారు.  నిత్యం పేదల పక్షాన గొంతుక వినిపించిన నిస్వార్థ తెలంగాణ మట్టి మనిషి అని చెప్పారు.అందెశ్రీ భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతమైన “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” గేయంగా నిత్యం ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ సీఎం ట్వీట్ చేశారు. 

అందెశ్రీ మరణం పట్ల బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. అందెశ్రీ అకాల మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని కేసీఆర్ అన్నారు. ఉద్యమ కాలంలో అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అందెశ్రీ మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.దివంగత అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.  

హరీష్ రావు సంతాపం

రచయిత అందెశ్రీ గారి అకాల మరణం బాధాకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అందెశ్రీ గారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, ఈరోజు ఉదయం తన స్వగృహంలో స్పృహ తప్పి పడిపోయారు అందెశ్రీ. వెంటనే ఆయన్ను గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూసినట్లుగా వైద్యులు తెలిపారు.  పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళాప్రభల కాంతి రేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ అన్న ప్రజాకవి అందెశ్రీ గారి మరణం తీరని లోటని పలువురు గుర్తుచేసుకుంటూ ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.  

అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.  2014లో అకాడమిఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం. 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్‌ నాయక్‌ పురస్కారం అందుకున్నారు అందెశ్రీ.

Advertisment
తాజా కథనాలు