హనుమకొండ జిల్లాలోని కాజీపేటలో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ వచ్చే ఏడాది ఆగస్టు నాటికి సిద్ధమవుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.ఈ యూనిట్‌లో గూడ్సు వ్యాగన్లు, ఇంజిన్లు, రైల్వే కోచ్‌లు తయారవుతాయని పేర్కొన్నారు. జర్మనీ టెక్నాలజీతో కూడిన ఆధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలతో పాటు సబర్బన్ రైళ్లకు వినియోగించే ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లు కలిపి ఏడాదికి 600 కోచ్‌లు ఉత్పత్తి చేసేలా ప్లాన్‌కు సిద్ధమైనట్లు తెలిపారు. దీనివల్ల 3 వేల మందికి ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు.
Also Read: పొంగులేటి చెప్పిన పొలిటికల్ బాంబ్ ఏంటి? కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ అవుతారా?
నవంబర్‌లో చర్లపల్లి టెర్మినల్ ప్రారంభం
కాజీపేటకు ముందుగా పీరియాడిక్ ఓవర్ హాలింగ్ (POH) ప్రాజెక్టు మంజూరు అయ్యిందని.. దీన్ని ప్రధాని మోదీ చొరవతో విస్తరించినట్లు తెలిపారు. ప్రాజెక్టు వ్యయం మొత్తం రూ.680 కోట్లకు పెరిగినట్లు తెలిపారు. ఇక చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను నవంబర్‌లో ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే రాష్ట్రానికి స్లీపర్ వందేభారత్ రైళ్లను తీసుకొస్తామని పేర్కొన్నారు. రూ.720 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు.
40 స్టేషన్లు ఆధునీకీకరణ
మరోవైపు నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల పునరాభివృద్ధి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని.. తెలంగాణలో మొత్తం 40 స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామని తెలిపారు. కొత్తగా మరో 15 ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఫైనల్ లోకేషన్ సర్వేలో ఉన్నాయన్నారు. వాటి విలువ రూ.64,780 కోట్లని చెప్పారు. అయితే ఈ ఫైనల్ లొకేషన్ సర్వేలో ఉన్న రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు కొలిక్కి వచ్చేందుకు కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.
Also Read: తెలంగాణలో మరో ఎయిర్‌పోర్ట్.. త్వరలో పనులు షురూ!
ముందుగా రీజనర్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టు భూసేకరణ అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. రాష్ట్రవాటా రూ.700-800 కోట్లు పేర్కొన్నారు.