Kaleshwaram report: కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌లో ఉంది ఇదే.. వాటి బాధ్యత KCRదే!

కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కాళేశ్వరం అవకతవకలకు పూర్తిబాధ్యత కేసీఆర్ దేనని కమిషన్ వెల్లడించింది. కేసీఆర్ ప్రమేయం, ఆయన ఇచ్చిన ఆదేశాల వల్లే 3 బ్యారేజీల్లో సమస్యలు వచ్చాయని కమిషన్ తన నివేదికలో తెలిపింది.

New Update
kcr Kaleshwaram Commission Inquiry

Kaleshwaram Commission report

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌ను అధికారుల కమిటీ అధ్యయనం చేసింది. 650 పేజీల నివేదికను చదివి అద్యాయన కమిటీ దాని సారాంశాన్ని సిద్ధం చేసింది. అందులోని వివరాల ప్రకారం.. ‘‘మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణ నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్‌దే. నిపుణుల కమిటీ నివేదికను కేసీఆర్‌, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పక్కకు పెట్టారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదన్నది అసలు సరైన కారణం కాదు. బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం జరగలేదు. WAPCOS నివేదిక, డీపీఆర్‌ కంటే ముందే బ్యారేజీలకు సిద్ధం అయ్యారు. 

పూర్తి బాధ్యత KCRదే!

టెండర్లు, ఓ అండ్‌ ఎం డిజైన్‌, నాణ్యతలో లోపాలున్నాయి. బ్యారేజీల నిర్మాణానికి పూర్తి బాధ్యత అప్పటి సీఎం కేసీఆర్‌దే. జవాబుదారీతనం, పాలనాపరమైన విధానాలు పాటించలేదు. పాలనా విధానాలు అనుసరించకుండా హరీశ్‌రావు ఆదేశాలు ఇచ్చారు. ఆర్థిక జవాబుదారీ తనాన్ని అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ పాటించలేదు. కాళేశ్వరం బోర్డులో అధికారులు ఉన్నా వారికి సంబంధం లేదని ఈటల చెప్పారు. ప్రణాళిక, నిర్మాణం, ఓ అండ్‌ ఎం, నీటినిల్వ, ఆర్థిక అంశాలకు అప్పటి సీఎందే బాధ్యత.

ఆర్థిక అవకతవకలు, నిబంధనల ఉల్లంఘన

కాళేశ్వరంలో ఆర్థిక అవకతవకలు, నిబంధనల ఉల్లంఘన జరిగింది. ప్రాజెక్ట్ అధికారులు, నిర్మాణ సంస్థతో కుమ్మక్కయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగమైందని నివేదికలో ఉంది. బ్యారేజీలు దెబ్బతినడానికి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలే కారణం. నిర్మాణ స్థలం మార్పు, అంచనాల సవరింపులో అవకతవకలున్నాయి. డిజైన్ లోపాలు, నాణ్యత తనిఖీలు లేకపోవడంతో నష్టం జరిగింది. నిధుల దుర్వినియోగానికి బోర్డు సభ్యులు కూడా బాధ్యులు. కాళేశ్వరం బోర్డులోని అధికారులపై క్రిమినల్‌ బీచ్‌ ఆఫ్‌ ట్రస్ట్‌ కింద చర్యలు తీసుకోవాలి. మేడిగడ్డ నిర్మాణంపై L&T సంస్థకు ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వొద్దు. బ్యారేజీ 7వ బ్లాక్‌ను ఆ సంస్థ పునరుద్ధరించాలి. ఇతర ఆనకట్టల్లో లోపాల సవరణ కూడా చేయాల్సిందే. ఈ వ్యయాన్ని L&Tనే భరించాలి.’’ అని ఈ మేరకు నివేదిక సారాంశాన్ని అధికారుల కమిటీ తెలిపింది.

జస్టిస్ ఘోష్ కమిషన్..

తెలంగాణలో సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించింది. 700 పేజీలకు పైగా ఉన్న ఈ నివేదికలో ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు, ఆర్థికపరమైన లోపాలు, సాంకేతిక వైఫల్యాలకు సంబంధించి కీలక విషయాలు వెల్లడయ్యాయి. 

Advertisment
తాజా కథనాలు