Jubilee Hills by-elections : ప్రతిష్టాత్మకంగా జూబ్లీహిల్స్‌ ఎన్నికలు..ఈసారైన ఓటింగ్‌ శాతం పెరిగేనా?

రాష్ట్రంలో పలు సందర్భాల్లో ఉప ఎన్నికలు వచ్చాయి. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వీటన్నింటికీ భిన్నం. ఈ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటరు పట్టం కడుతాడనేది నవంబర్ 14న తేలనుంది.

New Update
Jubilee Hills Bypoll

Jubilee Hills by-elections

Jubilee Hills by-elections : రాష్ట్రంలో పలు సందర్భాల్లో ఉప ఎన్నికలు వచ్చాయి. గెలిచేవారు గెలిచారు, ఓడేవారు ఓడారు. అయితే ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనున్న జూబ్లీహిల్స్ వీటన్నింటికీ భిన్నం. ఈ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి జూబ్లీహిల్స్ ఓటరు పట్టం కడుతాడనేది నవంబర్ 14వ తేదీన వెల్లడికానుంది. 


అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే

జూబ్లీహిల్స్‌ బైపోల్‌ రాష్ట్ర రాజకీయాలనే మార్చేస్తుందన్నట్లుంది పార్టీల పంతం చూస్తుంటే. సిట్టింగ్‌ సీటుని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్‌ఎస్‌. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్‌ పార్టీ కి ఈ ఉప ఎన్నిక ఓ విధంగా రెఫరెండమే. ఇక అర్బన్‌లో బలపడుతున్న బీజేపీకి జూబ్లీహిల్స్‌లో గెలిస్తే అది బోనస్సే.  ఒక్క నియోజకవర్గ ఎన్నిక తెలంగాణ రాష్ట్ర రాజకీయాన్ని ప్రభావితం చేస్తోందనడంలో సందేహం లేదు. జూబ్లీహిల్స్‌ బైపోల్‌ కొత్త సమీకరణాలకు తెరలేపనుంది. అన్ని పార్టీల నేతలూ ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ ఎన్నికను చావోరేవో అన్నట్లే తీసుకున్నాయి ప్రధాన రాజకీయపక్షాలు..ఓట్‌ ప్లీజ్‌ అంటూ జూబ్లీహిల్స్‌లో ప్రతీ ఇంటి తలుపు తట్టాయి ప్రధానపార్టీలు. బస్తీలు, వార్డులను చుట్టేశాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మరణంతో జరుగుతున్న ఉప ఎన్నికను మూడుపార్టీలూ సవాలుగా తీసుకున్నాయి. సిట్టింగ్‌ సీటు కావటంతో సెంటిమెంట్‌తో కొడుతోంది బీఆర్‌ఎస్‌. గోపీనాథ్‌ సతీమణి సునీతకు టికెట్‌ ఇచ్చిన బీఆర్‌ఎస్‌కి ఈ ఎన్నిక అత్యంత కీలకంగా మారింది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక జరిగిన కంటోన్మెంట్‌ బైపోల్‌లో.. సిట్టింగ్ సీటుని దక్కించుకోలేకపోయింది బీఆర్‌ఎస్‌. అందుకే జూబ్లీహిల్స్‌ విషయంలో ఆ పార్టీ పట్టుదలగా ఉంది. గత ఎన్నికల్లో మద్దతిచ్చిన ఎంఐఎం ఈసారి కాంగ్రెస్‌వైపు ఉండటంతో.. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది గులాబీపార్టీ. బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలంతా ప్రచారంలోకి దిగిపోయారు. ఈ ఉప ఎన్నికల్లో గెలిచి.. తమ సత్తా చాటాలని నిర్ణయించింది. అంతేకాదు.. జూబ్లీహిల్స్‌లో గెలుపు ద్వారా రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలనే విధంగా ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఆ క్రమంలో రేవంత్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. అంతేకాదు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనల్లో విశ్వనగరం హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందనే అంశాన్ని ఆ పార్టీ ప్రజల్లోకి చాలా బలంగా తీసుకు వెళ్లింది. అదే విధంగా బీజేపీ సైతం తమ అభ్యర్థి గెలుపు కోసం గట్టిగానే ప్రచారం నిర్వహించింది. మరి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తారనేది తెలియాలంటే మాత్రం నవంబర్ 14 వ తేదీ వరకు ఆగాల్సిందే.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఫైట్‌లో సమీకరణాలు కలిసొస్తే తమకు బోనస్సేననుకుంటోంది బీజేపీ. కమలంపార్టీ ముఖ్యనేత లంతా జూబ్లీహిల్స్‌లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పదేళ్ల అధికారంలో బీఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదని, రెండేళ్లలో కాంగ్రెస్‌ హామీలు నిలబెట్టుకోలేకపోయిందని ప్రజల్లోకెళ్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ ఓటర్లపై నమ్మకం పెట్టుకుంటే.. దానికి రివర్స్‌ స్ట్రాటజీలో వెళ్తున్నారు కమలంపార్టీ నేతలు. జూబ్లీహిల్స్‌ బైపోల్‌లో 58మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. మూడుపార్టీల మధ్యే గట్టి పోటీ నడుస్తోంది. గ్రేటర్‌ సిటీకి గుండెకాయలాంటి నియోజకవర్గంలో ఎలాగైనా పాగా వేయాలన్న పట్టుదలతో వ్యూహాలకు పదునుపెడుతున్నాయి ప్రధానపార్టీలు..

4 లక్షల మంది ఓటర్లు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటింగ్ శాతం ఈసారి కీలకంగా మారనుంది. ఈ నియోజకవర్గంలో సుమారు 4 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఈ సంఖ్య పూర్తి స్థాయిలో పోలింగ్ జరిగే రోజును బట్టి ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఆదివారం రోజున పోలింగ్ జరిగితే, ప్రజలు ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి మంగళవారం రోజున పోలింగ్ జరుగుతుండటంతో ఉద్యోగులు, వ్యాపారవేత్తలు వంటి వర్గాలు ఓటు వేయడానికి పెద్ద ఎత్తున రావడం కష్టమేనని అంచనా వేస్తున్నారు.  

సామాజిక వర్గాల వారిగా..

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు: 4,01,365కాగా వీరిలో బీసీలు: 1.50-1.80 లక్షలు, ముస్లింలు: 96,500, ఎస్సీలు: 26,000, కమ్మ: 17,000, రెడ్డి: 18,000, యాదవులు: 15,000, క్రిస్టియన్లు: 10,000, పురుషులు:  2,08,561, మహిళలు:  1,92,779, నోటిఫికేషన్ తర్వాత పెరిగిన ఓటర్లు:  2,383, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెరిగిన ఓటర్లు16,100, ఇతరులు:  25 ,కొత్త ఓటర్లు: 12,380 (18-19 ఏళ్లు) 30 ఏళ్ల లోపు ఓటర్లు: 29,880, సెటిలర్లు: 34000-4000

రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే నగరంలోని నియోజకవర్గాల్లో ఎప్పుడూ ఓటింగ్​శాతం తక్కువగానే నమోదవుతూ వస్తోంది. అయితే, రేపు జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ సీన్​రిపీట్​కాకుండా ఉండేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. 2023 సాధారణ ఎన్నికల్లో ఇక్కడ 48.42 శాతం పోలింగ్ నమోదైంది. అర్భన్ ప్రాంతాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదవడం సాధారణమే అయినా..జూబ్లీహిల్స్‌‌‌‌లో మరీ 50 శాతాని కంటే తక్కువ నమోదవడం ఆశ్చర్యపరిచింది.

జూబ్లీహిల్స్​లో గత పోలింగ్​సరళి ఇలా.. 

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2009లో జరిగిన ఎన్నికల్లో 52.77 శాతం పోలింగ్ నమోదైంది. అప్పుడు ఓటర్లు  2,59,416 మంది ఉండగా, 1,36,893 ఓట్లు పోలయ్యాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లు 3,29,522 మంది ఉండగా, 1,65,368 ఓట్లు పోలయ్యాయి. 50.18 శాతం పోలింగ్ నమోదైంది. అయితే, 2018 ఎన్నికల్లో ఒక్కసారిగా  45.59 శాతానికి  తగ్గింది. ఆ ఎన్నికలప్పుడు  3,41,537 ఓటర్లుండగా,  1,55,729 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత  అసెంబ్లీ ఎన్నికల్లో 3,75,430 ఓటర్లకు 1,83,312 మంది ఓట్లు వేశారు. అప్పుడు 48.82 శాతం నమోదైంది. ప్రస్తుతం జరగనున్న బై పోల్ లో  ఓటర్ల సంఖ్య- 4,01,365  కాగా, ఇందులో పురుషులు- 2,08,561 మంది,  మహిళలు- 1,92,779 మంది, ఇతరులు- 25 మంది ఉన్నారు. గత ఎన్నికల కంటే సుమారు 25వేల మంది పెరగడంతో పర్సంటేజీ పెరుగుతుందనే ఆశతో అధికారులు ఉన్నారు. 

 మాస్‌ ఓటింగే కీలకం

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్లాస్, మాస్ ఏరియాలున్నాయ్. ఓ వైపున సంపన్నులుంటే.. మరోవైపు సాధారణ ప్రజలు ఉంటారు. ఇక్కడ ఎన్నికలొస్తే.. పోలింగ్ బూత్ దాకా వచ్చే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. మరోవైపు.. స్లమ్ ఏరియాలు, పేదలు నివసించే ప్రాంతాలు కూడా ఎక్కువే ఉన్నాయి. ఇక్కడి ఓటర్లే.. ఎక్కువ సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే.. తెలంగాణ వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్‌కు తొలిసారి ఉప ఎన్నిక వచ్చింది. మరి.. ఈ బైపోల్ విషయంలోనైనా.. జూబ్లీహిల్స్ ఓటర్ల తీరు మారుతుందా? లేక.. ఎప్పటిలాగే మెజారిటీ ఓటర్లు ఈ ఉపఎన్నికని కూడా లైట్ తీసుకుంటారా? అనే చర్చ మొదలైంది. పార్టీల గెలుపోటముల గురించి ఇప్పుడు ఎంత చర్చ జరుగుతుందో.. పోలింగ్ శాతంపై కూడా అంతే డిబేట్ నడుస్తోంది.  జూబ్లీహిల్స్‌ బరిలో ఉన్న ప్రధాన పార్టీల నాయకులంతా.. ఓటర్లని పోలింగ్ స్టేషన్ల దాకా తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా.. మాస్ ఏరియాల్లో బీసీ, ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్న ప్రాంతాల్లోని ఓటర్లను.. పోలింగ్‌కు రప్పించడానికి పార్టీలు మరింత ఫోకస్ చేసే అవకాశం ఉంది. క్లాస్ ఏరియాల్లో నివసించే వారు.. పోలింగ్‌లో పాల్గొనేలా చూసేందుకు.. పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు ఇప్పటికే పర్సనల్ అప్పీల్స్ చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి.. వారు ఓటు వేయాలని కోరుతున్నారు. కానీ.. వాళ్లంతా పోలింగ్ కేంద్రాల దాకా వస్తారా? లేదా? అనేదే.. ఇప్పుడు మోస్ట్ ఇంట్రస్టింగ్ పాయింట్.

Advertisment
తాజా కథనాలు