దేశవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది ఇంజినీరింగ్ పూర్తి చేస్తున్నారు. కానీ అందులో దాదాపు 70 శాతం మందికి ఉద్యోగాలు రావడం లేదు. దీనికి కారణం వారిలో సరైన నైపుణ్యాలు లేకపోవడమే. అలాగే సిలబస్‌లో ఉండే పాఠాలు సైతం కంపెనీల్లో ఉద్యోగం చేయడాలని ఎందుకు పనిరావడం లేదని వివిధ పరిశ్రమల ప్రతినిధులు కూడా ఆవేదన, అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జేఎన్‌టీయూహెచ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాలన్ని పరిగణలోకి తీసుకొని విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యాలే లక్ష్యంగా ఇంజినీరింగ్ సిలబస్‌ను మార్చేందుకు సిద్ధమవుతోంది. వచ్చే విద్యా సంవత్సరం (2025-2026) నుంచి కొత్త సిలబస్‌ను అమల్లోకి తీసుకురానుంది. దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.
Also Read: వారానికి 5 రోజుల పనిపై చట్టం తేవాలి: శశిథరూర్
జేఎన్‌టీయూహెచ్ ప్రతి మూడేళ్లకోసారి ఇంజినీరింగ్ సిలబస్‌ను మారుస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే మూడేళ్ల క్రితం 2022-23 విద్యా సంవత్సరంలో మార్పులు చేశారు. అంటే 2022-23, 2023-24, 2024-25 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ తీసుకున్న వారికి నాలుగేళ్ల వరకు ఇదే సిలబస్ వర్తిస్తుంది. అంతేకాదు జాతీయ నూతన విద్యా విధానంలో సూచించినట్లుగా ఎగ్జిట్- ఎంట్రీ ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. రెండేళ్ల వరకు చదువు పూర్తిచేసుకోని కూడా మానుకొని వెళ్లిపోవచ్చు. అయితే వాళ్లకి డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తారు. ఆ తర్వాత మళ్లీ వచ్చి కూడా చదువుకోవచ్చు. మైనర్ డిగ్రీని కూడా అమల్లోకి తీసుకొచ్చారు. అయితే ఈసారి మాత్రం ప్రధానంగా సిలబస్‌పై దృష్టి సారించామని జేఎన్‌టీయూహెచ్ రెక్టార్ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి చెప్పారు.
ప్రాజెక్టులపైనే ఫోకస్
ఇండియా స్కిల్ రిపోర్ట్ (ISR)-2024 ప్రకారం చూసుకుంటే 65 శాతం ఇంజినీరింగ్ విద్యార్థుల్లోనే ఉద్యోగ నైపుణ్యాలున్నట్లు తేలింది. ఇక మరికొన్ని సర్వేలు నాలుగో వంతు విద్యార్థులు కూడా ఉద్యోగాలకు పనికిరావడం లేదని చెబుతున్నాయి. అందుకే ఈసారి ప్రాజెక్టులపైనే ప్రధానంగా దృష్టి సారించనుంది జేఎన్‌టీయూహెచ్. అవసరం లేని పాఠ్యాంశాలను తొలగించి.. ప్రస్తుతం, భవిష్యత్తులో ఉండే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని సిలబస్‌ను ఖరారు చేయనునుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కల్పిస్తామని ఇటీవల బడ్జెట్‌లో ప్రకటన చేసింది. దీంతో ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసే ఆలోచనలో ఉంది. ఐఐటీలు, ఎన్‌ఐటీలు అలాగే ఇతర ప్రముఖ విద్యాసంస్థలు వివిధ కోర్సుల్లో ఎలాంటి సిలబస్‌ను ఉంచాయో వాటిని కూడా అధికారులు పరిగణలోకి తీసుకోనున్నారు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డి రూ.8,888 కోట్ల కుంభకోణం.. ఆధారాలు బయటపెడతా: కేటీఆర్