Telangana Rains : రెండు రాష్ట్రాల్లో 15 రోజుల క్రితం భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు విపరీతంగా పడ్డాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జలాశయాలు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఈ క్రమంలోనే వర్షాలు, వరదలకు తెలంగాణంలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు అతాలకుతలం అయ్యాయి. మొత్తం 33 మంది ప్రాణాలు కోల్పోయారు.
10 వేల కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగింది. అయితే గత వారం రోజులుగా వరుణుడు కొంచెం బ్రేక్ ఇచ్చాడు. అయితే మంగళవారం నాడు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని తెలిపారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తక్కువగానే ఉన్నా.. పలు జిల్లాల్లో మాత్రం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు నిపుణులు తెలిపారు.
తెలంగాణలో పలు జిల్లాల్లో చిరు జల్లులు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీస్తాయన్నారు.