హైదరాబాద్‌కు కరెంట్ కష్టాలు తీర్చడమే కాకుండా అధునాతనంగా ఉంచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. దీని కోసం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వివిధ దేశాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను పరిశీలించి నివేదిక అందించాలని సూచించారు. నిన్న ఇంటిగ్రేడెట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025ని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఆవిష్కరించారు. తరవాత దీనిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులోనే అండర్ గ్రౌండ్ కేబుల్స్ కూడా నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వేసవికి ఇబ్బందులు ఉండకూడదు.. అండర్ గ్రౌండ్ కేబుల్స్ ద్వారా విద్యుత్ దొంగతనాలను అరికట్టడమే కాకుండా ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉందని అన్నారు. రాబోయే వేసవిలో విద్యుత్ సరఫరా కు ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా డిస్కంలు సన్నద్ధం గా ఉండాలని చెప్పారు. గత ఏడాది మార్చి లో రాష్ట్రంలో విద్యుత్ పీక్ డిమాండ్ 15623 మెగా వాట్లకు చేరిందని, ఈ సారి అది మరింత పెరిగి 16877 మెగావాట్ల కు చేరుతుందని అంచనా వేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గరిష్ఠ విద్యుత్ డిమాండ్ అంచనాకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా కు ప్రణాళిక చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ రోజురోజుకూ విస్తరిస్తోందని...అవసరాలు కూడా పెరుగుతున్నాయని, దానికి తగ్గట్టు విద్యుత్ సరఫరా కూడా జరగాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఎక్కడైనా సమస్య వచ్చినా మరోచోట నుంచి విద్యుత్ అందించగలిగేటట్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే ఆదివాసీ గూడేలకు సోలార్ విద్యుత్, పంపుసెట్లు ఉచితంగా అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అటవీశాఖ, గిరిజనశాఖలతో పాటూ సంబంధిత శాఖలతో సమావేశమై గూడేలలో సోలార్ విద్యుత్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు. ప్రభుత్వ ఆఫీసు లు, పాఠశాలలు, ప్రభుత్వ భవనాల పై సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కు వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపే కంపెనీ లను ఆహ్వానించి ఏ విధానం లో వారికి పనులను అప్పగించాలనే ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు. ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలించాలన్నారు. Also Read: J&K: జమ్మూ–కాశ్మీర్‌లో మోదీ పర్యటన..జడ్ మోడ్ టన్నెల్ ఓపెనింగ్