/rtv/media/media_files/2025/08/14/vikarabad-2025-08-14-07-23-25.jpg)
ఓ వైపు భారీ వర్షాలతో తెలంగాణ ప్రజలు వణికిపోతుంటే మరోవైపు భూ ప్రకంపనల మరింత భయపెడుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలో భూమి కంపించింది. దీంతో జనాలు భయపడిపోయి ఇంట్లో నుంచి పరుగులు తీశారు. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా పరిగి పరిసర ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కొద్ది సెకన్ల పాటు సేపు భూమి కంపించింది. రెండుమూడు సార్లు భూమి కాస్త షేక్ కావడంతో ప్రజలు కంగారుపడిపోయి ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. రంగాపూర్, బసినపల్లి, న్యామత్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మళ్లీ భూప్రకంపనలు వస్తాయని భయంతో దాదాపు రెండుగంటల పాటు ప్రజలు బయట ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే దీని తీవ్రత, ఇతర వివరాలు ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) August 14, 2025
వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు
వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఉదయం 4 గంటల ప్రాంతంలో సంభవించిన భూప్రకంపనలు
పరిగి మండల పరిధిలోని బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్‌నగర్ గ్రామాల్లో మూడు సెకండ్ల పాటు స్వల్పంగా కంపించిన భూమి pic.twitter.com/uOXPQ8Gflp
గతంలోనూ భూ ప్రకంపనలు
వికారాబాద్ జిల్లాలో గతంలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. 2024 ఫిబ్రవరిలో వికారాబాద్ జిల్లాలో 2.5 తీవ్రతతో స్వల్ప భూకంపం నమోదైంది. 2021 సెప్టెంబర్‌లో బంట్వారం మండలం తోర్ మామిడి గ్రామంలో దాదాపు 40 సెకన్ల పాటు భూమి కంపించినట్లు వార్తలు వచ్చాయి. 2021 ఆగస్టులో తాండూరు – కర్ణాటక సరిహద్దులోని కొన్ని గ్రామాలలో భూ ప్రకంపనలు సంభవించాయి. అయితే, ఇప్పటివరకు పెద్దగా ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు. గతేడాది డిసెంబర్‌లో ములుగు జిల్లాలో 5.3 తీవ్రతతో కూడిన భూకంపం నమోదైంది. గత 50 ఏళ్లలో రాష్ట్రంలో ఇదే అతి పెద్ద భూకంపంగా గుర్తించారు అధికారులు. దీని ప్రభావం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా కనిపించింది.
ఈ ప్రకంపనలకు సంబంధించి, నిపుణులు భూమిలోని పలకల కదలికలే ప్రధాన కారణం అని చెబుతున్నారు. భూమి అంతర్గత పొరలలోని పలకలు బలమైన కదలికలకు గురైనప్పుడు భూ ప్రకంపనలు వస్తాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4 కంటే తక్కువగా ఉన్న భూకంపాలను సాధారణంగా చిన్నవిగా పరిగణిస్తారు, వీటి ప్రభావం పెద్దగా ఉండదు.
మరో రెండు రోజులు భారీ వర్షాలు
రాబోయే రెండు రోజులలో (ఆగస్టు 15, 16) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, హనుమకొండ, హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, కొమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యాయి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రాజెక్టులు, చెరువులు, కాలువలను పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కొన్ని జిల్లాలలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.