/rtv/media/media_files/2025/07/26/srushti-2025-07-26-22-48-55.jpg)
Srushti Test tube Center
సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. పిల్లల కోసం వచ్చిన దంపతులకు భర్త వీర్యకణాలతో కాకుండా ఇతరుల వీర్యకణాలతో గర్భం దాల్చేటట్లు చేసిన వైనం.. అక్కడి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో జరిగింది. పుట్టిన బాబుకు క్యాన్సర్ రావడంతో.. అనుమానంతో తల్లిదండ్రులు డీఎన్ఏ పరీక్షలు చేయించగా అసలు నిజం బయటపడింది. దీంతో బాధితులు గోపాల పురం పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచి నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్, ఆర్డీఓ సాయి రామ్, డీఎంహెచ్ డా. వెంకటి ఆధ్వర్యంలో హాస్పిటల్ కు చేరుకొని తనిఖీలు నిర్వహించారు.
గతంలోనూ సృష్టి మోసాలు..
దీని తర్వాత సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అసలు లింకులు విజయవాడలో ఉన్నాయని తెలుసుకుని అక్కడ తనిఖీలు నిర్వహించారు. అక్కడ టెస్ట్ ట్యూబ్ సెంటర్ ను నిర్వహిస్తున్న మహిళా డాక్టర్ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ ను హైదరాబాద్ పోలీసులకి విజయవాడ పోలీసులు అప్పగించారు. గతంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ పై వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు.
సృష్టి సెంటర్ డాక్టర్ నమ్రత మీద గతంలో కూడా కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. 2018లో వైజాగ్ లో ఇలాంటి మోసమే బయటపడడంతో ఐదేళ్ల పాటు హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేసింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. 2020లో డాక్టర్ కరుణ పేరుతో లైసెన్స్ తీసుకుని ఆసుపత్రి నిర్వహించినట్టు గుర్తించారు. తాజా ఘటనతో ఆసుపత్రి లైసెన్స్ వ్యవహారం తో పాటు బ్రాంచి లో ఎంత మంది పిల్లలకు జన్మించారు అనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.