Hyderabad: ప్రస్తుత కాలంలో ఎటుచూసినా కల్తీ కోరలు చాపుతోంది. తినే దాని దగ్గరి నుంచి నిత్యం వాడే వస్తువుల వరకు అంతా కల్తీ మయం అయింది. హైదరాబాద్‌లో అయితే కల్తీ రాయుళ్లు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. నకిలీ టీపొడి తయారు చేసి సప్లయ్ చేస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన బాలానగర్ మండలం ఫతేనగర్‌లో కల్తీ గుట్టును సెంట్రల్ టాస్క్‌ఫోర్స్ బృందం బట్టబయలు చేసింది. ఓ గోడౌన్‌పై దాడి చేసిన పోలీసులకు విస్తుపోయే సంఘటన కనిపించింది. నాసిరకం టీ పౌడర్‌లో ఎండుకొబ్బరి పొడితో పాటు కొన్ని కెమికల్స్ కలుపుతున్నట్టు గుర్తించారు.
నగరంలోని పలు ప్రాంతాలకు..
గోడౌన్‌ను సీజ్ చేసి రూ.2 లక్షల విలువైన కల్తీ టీపొడిని స్వాధీనం చేసుకున్నారు. కోణార్క్ టీ పౌడర్ స్లయర్స్ పేరుతో ఈ దందా సాగుతోంది. బిషోయ్ జగన్నాథ్(32) అనే వ్యక్తి ఈ గోడౌన్‌ను నడుపుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. వర్కర్లుగా పని చేస్తున్న ప్రతాప్ ప్రధాన్, శివ్స్వైన్పరిడాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కల్తీ టీపొడిని స్థానికంగానే కాకుండా నగరంలోని పలు ప్రాంతాలకు పంపుతున్నారు. సమాచారం అందుకున్న సెంట్రల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గోడౌన్‌పై దాడి చేసి 300 కిలోల నకిలీ టీ పౌడర్‌తో పాటు 200 కిలోల ఎండు కొబ్బరి, కలర్స్, మిషన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: షాకింగ్ న్యూస్.. పెర్ఫ్యూమ్ వాడితే క్యాన్సర్..