/rtv/media/media_files/2025/08/05/guvvala-2025-08-05-11-46-22.jpg)
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలో తాను బాధతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సులభంగా నిర్ణయం తీసుకోలేదని, పార్టీ పట్ల తనకు ఎప్పటికీ గౌరవం ఉంటుందని తెలిపారు. సుమారు రెండు దశాబ్దాల పాటు పార్టీలో తనకు ఇచ్చిన గౌరవం, గుర్తింపునకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
వాళ్లకు రుణపడి ఉంటా
RTV కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గువ్వల బాలరాజు మాట్లాడుతూ రాజీనామాపై సంచలన విషయాలు వెల్లడించారు. తన రాజకీయ భవిష్యత్ కోసమే రాజీనామా చేశానని అన్నారు. ఏడాదిన్నర కాలంగా BRSతో దూరంగా ఉంటున్నానని చెప్పిన ఆయన.. అచ్చంపేట ప్రజల కోరిక మేరకు మరో పార్టీలో చేరుతానని తెలిపారు. బీజేపీలో చేరుతానని ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద పెద్ద నేతలు ఆహ్వానిస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తమ నియోజకవర్గానికి చెందినవారేనని తెలిపారు. త్వరలో ఏ పార్టీలో చేరుతానో వెల్లడిస్తానని అన్నారు. తనను పెద్ద చేసింది అచ్చంపేట ప్రజలేనని బాలరాజు గుర్తుచేసుకున్నారు. వాళ్లకు రుణపడి ఉంటానన్నారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు గుర్తింపు ఇచ్చారని అన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ కొంత బాధలో ఉందని తాను మరింత బాధ పెట్టదల్చుకోలేదని చెప్పారు బాలరాజు. బీఆర్‌ఎస్‌కు రెండ్రోజుల క్రితమే రాజీనామా చేశానన్నారు.
2014, 2018 ఎన్నికల్లో అచ్చంపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలరాజు, నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటూ వచ్చారు. గువ్వల బాలరాజు రాజీనామా బీఆర్‌ఎస్‌కు మరో ఎదురుదెబ్బేనని చెప్పాలి.
ఆడియో సోషల్ మీడియాలో వైరల్
కాగా తాజాగా గువ్వల బాలరాజు ఫోన్ లో ఓ కార్యకర్తతో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫోన్ కాల్లో బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని అనే వార్తలు వస్తున్నాయని, అలాంటప్పుడు తన అభ్యర్థిత్వం ఎగిరిపోతుందని మాట్లాడారు. గతంలో బీజేపీతో పోరాటం చేసిన వాడినని అన్నారు. బీఆర్ఎస్ కంటే ముందే తన దారి తను చూసుకుని బీజేపీలో కలవడం మంచిదని నిర్ణయం తీసుకున్నట్లుగా గువ్వల కార్యకర్తకు చెప్పుకొచ్చారు. పార్టీలో తనను కాదని నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఇవ్వడంపై కూడా ఆయన ఫోన్‌లో చర్చించారు.
బీఆర్ఎస్ లోనే కొనసాగుతాం
ఇదిలావుంటే తాము పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ లోనే కొనసాగుతామన్నారు. పార్టీ పటిష్ఠత కోసం తాము పనిచేస్తామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల కోసం, నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాయమని అన్నారు. తమపై కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు