BRS : గులాబీ పార్టీలో గ్రూప్ వార్.. తలలు పట్టుకుంటున్న అధిష్టానం

 గులాబీ పార్టీలో గ్రూపు తగాదాలు మున్సిపల్ ఎన్నికలపై ప్రభావం చూపేలా ఉన్నాయనే ఆ పార్టీ నాయకత్వం ఆందోళనతో ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు అభ్యర్థుల ఎంపికపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

New Update
brs party'

Group war in the brs

BRS : గులాబీ పార్టీలో గ్రూపు తగాదాలు మున్సిపల్ ఎన్నికలపై ప్రభావం చూపేలా ఉన్నాయనే ఆ పార్టీ నాయకత్వం ఆందోళనతో ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు అభ్యర్థుల ఎంపికపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక స్థానాలు కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీని ఢీకొట్టాలని కారు పార్టీ కంకణం కట్టుకుంది. అయితే నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, ఆధిపత్యపోరు ఆ పార్టీకి రాజకీయంగా ఇబ్బందిగా మారిందనే అభిప్రాయాలున్నాయి.
రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఉంది. మహబూబాబాద్, భూపాలపల్లి, షాద్ నగర్, కాగజ్ నగర్, ఆలేరు, నాగార్జునసాగర్ వంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాయకుల మధ్య కారు పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఉంది. ఈ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో అభ్యర్థుల ఎంపికలో తమ వర్గానికి  ప్రాధాన్యత కోసం  వర్గాలు పట్టుకోసం ప్రయత్నించే అవకాశం ఉంది. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన  ఎమ్మెల్యే అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ చార్జీలకే మున్సిపల్ ఎన్నికల టికెట్లు కేటాయించే అధికారం ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలున్నాయి.ఈ నిర్ణయంపై కొందరు సీనియర్లు  అసంతృప్తిని వ్యక్తం చేశారని ప్రచారం సాగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఉన్న ఆధిపత్యపోరులో తమ వర్గానికి  చెందినవారికి టికెట్లు దక్కకుండా పోయే అవకాశం ఉందనే ఆందోళన  కొందరిలో నెలకొంది. గెలుపు అవకాశాలున్నవారినే బరిలోకి దింపాలని పార్టీ నాయకత్వం సూచించింది.  గెలుపు అవకాశాలు కూడా లేనివారికి  టికెట్లు కేటాయించడం వల్ల ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టు అవుతోందనేది ఆ పార్టీ భావన.  ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని టికెట్లు కేటాయించాలని కారు పార్టీ నాయకత్వం సూచించింది. కచ్చితంగా గెలుపు అవకాశాలున్నవారికి టికెట్లు  నిరాకరిస్తే ఆ విషయం తమ దృష్టికి తేవాలని గులాబీ పార్టీ నాయకత్వం ఇంచార్జులకు తేల్చి చెప్పారని సమాచారం. 

మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుల మధ్య గ్రూపుల పంచాయితీ సద్దుమణిగినట్టు లేదనే ప్రచారం ఉంది.  మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ మంత్రి  రెడ్యానాయక్  కూతురు మాజీ ఎంపీ కవిత మధ్య గ్యాప్ ఉందనే గులాబీ పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్  కూడా గతంలో ఇదే నియోజకవర్గం నుంచి  ప్రాతినిథ్యం వహించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆమె ఎమ్మెల్సీగానే కొనసాగారు. ఈ నియోజకవర్గంలో కీలక నాయకుల మధ్య గ్యాప్ టికెట్ల కేటాయింపుపై పడే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. 

 భూపాలపల్లి నియోజకవర్గంలో మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మధ్య కూడా ఆధిపత్యపోరు సాగుతోంది. ఈ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో గండ్ర వెంకటరమణారెడ్డినే గులాబీ పార్టీ బరిలోకి దింపే అవకాశం ఉందనే ఆయన వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. ఇది మధుసూధనాచారి వర్గీయులను అసంతృప్తికి గురి చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో తమకు టికెట్లు దక్కుతాయా లేదో ఆందోళన మధుసూధనాచారి వర్గీయుల్లో ఉందనే ప్రచారం నెలకొంది.

సిర్పూర్ కాగజ్ నగర్  అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మధ్య ఆధిపత్యపోరు సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు కోనప్ప. హస్తం పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదని  కోనప్ప తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ నియోజకవర్గంపై ప్రవీణ్ కుమార్ ఆశపెట్టుకున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ నియోజకవర్గంలో మకాం వేసి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ తమ వర్గం వారికే టికెట్ల కోసం పట్టుబడుతున్నారు.

షాద్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే అంజయ్య,  ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి వర్గాల మధ్య పోరు సాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో తమ వర్గం అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ రెండు వర్గాలు తమ వారికి టికెట్ల కోసం పట్టుబడుతున్నారు.  నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గాల మధ్య గ్యాప్ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఇదే పరిస్థితి నెలకొంది.  వరంగల్​ఈస్ట్  ​నియోజకవర్గంలో కూడా ఇదే సమస్య ఉంది. 

ఆలేరులో మాజీ ఎమ్మెల్యేలు భిక్షమయ్య గౌడ్, గొంగిడి సునీత మధ్యల ఆధిపత్యపోరు సాగుతోంది. మునుగోడులో  మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పాల్వాయి రజనీరెడ్డి వర్గాల మధ్య కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో తమ వర్గాలకు టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. నేతల మధ్య గ్యాప్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపకుండా ఉండేలా గులాబీ పార్టీ నాయకత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. 

Advertisment
తాజా కథనాలు