/rtv/media/media_files/2025/11/26/fotojet-2025-11-26t083716444-2025-11-26-08-37-30.jpg)
GHMC to be merged into three corporations
GHMC: ఇన్నాళ్లు అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)’ త్వరలో మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా మారబోతుంది. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీంటిని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట, ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ (మున్సిపాలిటీ, కార్పొరేషన్లను) GHMC లో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్ లకు సవరణలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.దీంతో బల్దియా బయట, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి. ఓఆర్ఆర్ లోపల జనాభా పెరగడంతో అన్ని ప్రాంతాల్లో సమగ్రమైన అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వర్గం తెలిపింది.
ప్రస్తుతమున్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల తరహాలోనే జీహెచ్‌ఎంసీని కూడా మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. 27 మున్సిపాలిటీలు/కార్పొరేషన్ల విలీనంతో అతి భారీ నగరంగా మారే అవకాశం ఉంది. పాలనా సౌలభ్యం కోసం కోర్ అర్బన్ ప్రాంతాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా కార్పొరేషన్ల్ల పరిధిలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా డివిజన్ల ఏర్పాటు, సరిహద్దులను నిర్ధారించడంపై కసరత్తు జరుగుతోంది.
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధి 650 చ.కి.మీ వరకు విస్తిరించి ఉంది. జీహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల విలీనంతో దీనిలోకి (కోర్ అర్బన్ రీజియన్) మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా నుంచి సుమారు 1,085 చ.కి.మీ., రంగారెడ్డి జిల్లా నుంచి 700 చ.కి.మీ., సంగారెడ్డి నుంచి 300 చ.కి.మీ ప్రాంతం వచ్చి చేరనుంది. మొత్తం విస్తీర్ణం 2,700 చదరపు కిలోమీటర్లకు చేరుకుంటుండగా, జనాభా 2 కోట్లకు పైగా ఉంటుంది. దీని మూలంగా పాలనాపరమైన నిర్ణయాల అమలు, పర్యవేక్షణ పెద్ద సవాలుగా మారనుంది. ఈ క్రమంలోనే కోర్ అర్బన్ ప్రాంతంలో మూడు కార్పొరేషన్ల ఏర్పాటుకు కసరత్తు జరుగుతుంది. పాలనాపరమైన ప్రక్రియ అంతా మార్చి నాటికి ముగిసే అవకాశం ఉంది. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలక వర్గం గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుంది. తర్వాత ప్రత్యేకాధికారుల పాలనలో ప్రభుత్వం కోర్ అర్బన్‌పై విధివిధానాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ చట్టం, పురపాలక చట్టాలను సవరించేందుకు సిద్ధమైంది.
అతిపెద్ద నగరంగా భాగ్యనగర్
శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంతో భాగ్యనగరం (హైదరాబాద్) దేశంలోని మెట్రో నగరాల్లో అతిపెద్ద నగరంగా అవతరించనుంది. ఐదు జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో ఆరు పార్లమెంటు స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలతో దేశంలోనే అతి పెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించబోతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, ఐటీ క్యాపిటల్ బెంగళూరుతోపాటు చెన్నై, కోల్‌కతా తదితర మెట్రో నగరాల కంటే అగ్రభాగంలో నిలవనుంది. దేశంలోని మిగిలిన నగరాలతో పోల్చితే హైదరాబాద్ నగరం నలుదిక్కులా శరవేగంతో విస్తరించింది. ఇతర మెట్రో నగరాలతో పోల్చితే జీవన వ్యయం తక్కువగా ఉండటం, భాషా సమస్య లేకపోవడంతో విద్య, ఉద్యోగావకాశాలు, వ్యాపారం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచేకాకుండా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల వారు హైదరాబాద్‌ను తమ నివాస ప్రాంతంగా ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్పటికే నగరం ఔటర్ రింగు రోడ్డు దాటిపోయింది.ఫార్మా రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న హైదరాబాద్.. ఐటీలోనూ బెంగళూరును మించి దూసుకుపోనుంది. బయోటెక్నాలజీ, ఇతర వ్యాపార, వాణిజ్య రంగాల పరంగా వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ తరుణంలో జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించి పాలనపరంగా నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నగరంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు, వారికి కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, అందిస్తున్న పరిపాలన పూర్తిగా ఒకేవిధంగా ఉండాలనే సంకల్పంతోనే ఈ మహా విలీనం ప్రక్రియ చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది.
జీహెచ్‌ఎంసీలో విలీనం అయ్యే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇవే...
నగర పాలక సంస్థలు
బోడుప్పల్ , పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట, బడంగ్ పేట, మీర్ పేట, బండ్లగూడ జాగీర్,
మున్సిపాలిటీలు
దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, దుండిగల్, కొంపల్లి, మేడ్చల్, పెద్ద అంబర్ పేట. తుర్కయాంజల్, ఆదిభట్ల, జల్ పల్లి, శంషాబాద్, మణికొండ, తుక్కుగూడ, నార్సింగి, ఐడీఏ బొల్లారం, తెల్లాపూర్ ,అమీన్‌పూర్
Follow Us