/rtv/media/media_files/2025/09/06/ganesh-nimajjanam-hyderabad-narayanpet-man-died-after-dance-2025-09-06-17-49-17.jpg)
Ganesh Nimajjanam hyderabad narayanpet man died after dance
దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలు దేవునిపై అపారమైన భక్తిని చూపించి డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు. మరికొన్ని గంటల్లో గణేషుని నిమజ్జన కార్యక్రమాలు పూర్తి కానున్నాయి. భక్తులు, ప్రజలు, యువతీ యువకులు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ డ్యాన్సులతో నిమజ్జన కార్యక్రమాలను మరింత ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లోని గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిమజ్జనం ఊరేగింపుల్లో వివిధ వేషధారణల్లో డ్యాన్స్‌లు చేస్తూ భక్తులను అలరిస్తున్నారు.
డ్యాన్స్ చేస్తూ వ్యక్తి మృతి
అయితే కొన్ని ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కొందరు వ్యక్తులు మరణించిన విషాద సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటిదే మరొక విషాద ఘటన చోటుచేసుకుంది. 45 ఏళ్ల ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తూ సడెన్‌గా కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఒక ఎస్సై CPR చేసినా ఫలితం లేకపోయింది. అనంతరం ఆయనకు హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
నారాయణపెటలో గణేశుడి నిమజ్జనం కార్యక్రమంలొ డాన్స్ చేస్తూ శేఖర్ (45) అనే వ్యక్తి మృతి.. #GaneshImmersion#narayanapetpic.twitter.com/2Vok9x9Wp7
— Aravind (@Aravindjourno) September 6, 2025
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆయన పేరు శేఖర్ (45). నారాయణ పేట జిల్లా సింగార్ కాలనీలో ఉంటున్నారు. ఆయన గణేషుని నిమజ్జనంలో సంతోషంగా పాల్గొన్నారు. డ్యాన్సులు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. అంతలోనే ఆనందం కాస్త విషాదంగా మారింది. నిమజ్జనం ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కింద పడిపోయారు. వెంటనే పక్కనే ఉన్న ఎస్సై వెంకటేశ్వర్లు ఆయనకు సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి చేరుకునేలోపే శేఖర్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. గుండెపోటు రావడమే మృతికి కారణమని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.
పండుగ పూట డ్యాన్సుల సందర్భంగా అధిక శారీరక శ్రమ, అలసట, తీవ్రమైన ఉద్వేగం కారణంగా ఈ సంఘటన జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనతో శేఖర్ కుటుంబంలో, అలాగే స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. శేఖర్ మరణంతో అతని స్నేహితులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. పండుగ వేళ జరిగిన ఈ దుర్ఘటన స్థానికులను కలచివేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇలాంటిదే ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా బొబ్బాదిపేటలో మరో విషాదం చోటుచేసుకుంది. 22 ఏళ్ల హరీష్ అనే యువకుడు డీజే సౌండ్‌కు డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా గుండెపోటుతో మరణించాడు.