/rtv/media/media_files/2025/09/06/ganesh-immersion-2025-09-06-06-39-34.jpg)
Ganesh immersion
ఎంతో ఘనంగా చవితి నాడు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఎంత ఆనందంగా, పూజలతో గణపతిని ఆహ్వానిస్తారో అంతే ఘనంగా భాద్రపద మాసంలో అనంత చతుర్దశి రోజున గణపతిని నిమజ్జనం చేస్తారు. అయితే పూజలు చేసేటప్పుడు మాత్రమే కాదు.. నిమజ్జనం చేసేటప్పుడు కూడా కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి, నియమాలు పాటించాలని పండితులు అంటున్నారు.
నిమజ్జనానికి ముందు పూజా విధానం
ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించాలి. ఆ తర్వాత పూజకు సర్వం సిద్ధం చేయాలి. చివరిసారిగా గణపతిని ప్రత్యేకంగా పూజించాలి. తనకి ఇష్టమైన ఉండ్రాళ్లు, మోదకాలు, లడ్డూలు, పానకం, వడపప్పు వంటి నైవేద్యాలను సమర్పించాలి. ధూపం, దీపం వెలిగించి, పూజ పూర్తి చేసి హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత వినాయకుడిని పంపించేందుకు "శ్రీ మహాగణపతయే నమ: యథాస్థానం ప్రవేశయామి" అని ప్రార్థించాలి. తిరిగి తన స్థానానికి వెళ్లమని గణపతిని కోరాలి. మళ్లీ ఇదే ఏడాది రావాలని కోరుకోవాలి. ఆ తర్వాత రెండు చేతులతో గణపతిని నమస్కరించి స్మరించుకోవాలి.
9 రోజుల పాటు గణపతి ఉత్సవాల్లో ఏవైనా తప్పులు జరిగి ఉంటే క్షమించమని అడగాలి. ఆ తర్వాత ఐదు లేదా తొమ్మిది సార్లు గుంజీలు తీయాలి. అలాగే దీపారాధన జరిగిన తర్వాత గణపతి పూజకి ఉపయోగించిన పత్రిని తీసుకోవాలి. ఇందులోని ఐదు ఆకులకు పసుపు, కుంకుమ, గంధం పెట్టి పసుపు దారంతో చేతికి కట్టుకోవాలి. దీనివల్ల మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు మళ్లీ చివరిసారిగా అగరబత్తులు, కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి "గణపతి బప్పా మోరియా", "జై బోలో గణేష్ మహారాజ్" అనే నినాదాలు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల వినాయకుడి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని పండితులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.