/rtv/media/media_files/2026/01/26/aaruri-ramesh-2026-01-26-21-41-08.jpg)
వరంగల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సోమవారం(జనవరి 26) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర పార్టీ నాయకత్వానికి పంపిన ఆయన, తిరిగి BRS గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఆరూరి రమేష్, వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే, కొంతకాలంగా ఆయన బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరిగింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, నియోజకవర్గంలోని రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన తిరిగి బీఆర్ఎస్‌లో చేరడమే మేలని భావించినట్లు సమాచారం.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) January 26, 2026
బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
ఎల్లుండి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించిన ఆరూరి రమేష్ pic.twitter.com/4ZwZg2Yy34
రాజీనామాకు కారణాలు
బీజేపీలో సరైన ప్రాధాన్యత లభించకపోవడం, తన కేడర్‌ను కాపాడుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వడం వంటి కారణాలతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజీనామా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన రాజకీయ భవిష్యత్తు కోసం మరియు కార్యకర్తల అభీష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఎల్లుండి 'గులాబీ' కండువా
ఆరూరి రమేష్ ఎల్లుండి (బుధవారం) తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేదా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ బలపడేందుకు ఆరూరి రాక దోహదపడుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆరూరి రమేష్ బీఆర్ఎస్‌లోకి తిరిగి రావడం వరంగల్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో చూడాలి.
Follow Us