/rtv/media/media_files/2025/10/22/jubilee-hills-elections-2025-10-22-20-02-37.jpg)
Jubilee Hills elections...Big twist at the last minute
Jubilee Hills By Election : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు నామినేషన్లు ముగిశాయి. ఈ ఎన్నికల్లో అత్యధికంగా 321 నామినేషన్లు దాఖలయ్యాయి. 211మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. ఈ నామినేషన్లను రిటర్నింగ్ అధికార్లు పరిశీలించారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల నామినేషన్ల విషయంలో చివరినిమిషం వరకు ఉత్కంఠ నెలకొంది.
మాగంటి భార్య కాదంటూ..
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత విషయంలో తొలుత ఉత్కంఠ నెలకొంది. జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ వారసుడిని తానేనంటూ మొదటి భార్య కొడుకు తారక్ ప్రద్యుమ్న తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు.BRS అభ్యర్థి మాగంటి సునీతపై తీవ్రమైన ఆరోపణలు చేయడమేకాకుండా సునీత గోపినాథ్ భార్యే కాదంటూ ఈసీకి తారక్ ప్రద్యుమ్న ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.సునీత అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని. తారక్ ప్రద్యుమ్న ఆరోపించారు. మాగంటి గోపినాథ్‌కు చట్టబద్ధమైన ఏకైక కుమారుడిని నేనేనంటూ- తారక్ ప్రద్యుమ్న స్పష్టం చేశారు. దీంతో బీఆర్‌ఎస్ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్‌ఎస్ గోపినాథ్ భార్య సునీతకు టికెట్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే గోపినాథ్ కుటుంబ వ్యవహారంపై చివరి నిమిషంలో ఏదైనా సమస్య వచ్చి సునీత అభ్యర్థిత్వం తిరస్కరణకు గురయితే ప్రత్యామ్నయంగా ఉండాలనే ఉద్ధేశంతో రెండో అభ్యర్థిగా పీజేఆర్ తనయుడు విష్ణువర్థన్ రెడ్డితో నామినేషన్ వేయించింది. బీఆర్‌ఎస్ ఊహించిన విధంగానే మొదటి భార్య తనయుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో సునీత అభ్యర్థిత్వంపై మరోసారి నీటినీడలు కమ్ముకున్నాయి. అయితే ఈ విషయాన్ని పరిశీలించిన ఎన్నికల కమిషన్ వివాదాన్ని కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని, ఈ విషయం ఎన్నికల సంఘం పరిధిలోకి రాదని తేల్చడంతో పాటు సునీత అభ్యర్థిత్వాన్ని ఒకే చేయడంతో బీఆర్‌ఎస్ ఊపిరి పీల్చుకుంది.
వివరాలు సరిగా నింపలేదని..
ఇక నవీన్ యాదవ్ నామినేషన్ విషయంలోనూ చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఆయనపై గతంలోనే పలు కేసులు ఉన్నట్లు ఆరోపణలు రాగా, తాజాగా ఓటరు కార్డులు పంపిణీ చేసినట్లు క్రిమినల్ కేసు కూడా నమోదైంది. ఈ వివాదం ఇలా ఉండగానే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ నామినేషన్ పై బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్దేశిత కాలమ్స్ లో వివరాలు నింపకుండా తప్పులు ఉన్నాయని ఆయన తన అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా బీఆర్‌ఎస్ ఫిర్యాదుతో నవీన్ యాదవ్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరిగి పరిశీలించారు.
కాగా ఫామ్ 26 లోని మొదటి మూడు పేజీలలో ఉన్న కాలమ్స్ విషయంలో అభ్యంతరాలున్నాయని బీఆర్‌ఎస్ ఆరోపించింది. ఇదే కారణంతో పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు అని బీఆర్‌ఎస్ తరపున న్యాయవాది భరత్ రిటర్నింగ్ అధికారి దృష్టికి తెచ్చారు. అలాంటపుడు నవీన్‌యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఎలా ఒకే చేస్తారని ప్రశ్నించారు. దీనిపై రిటర్నింగ్ అధికారి ఉన్నతాధికారుల సలహా తీసుకున్నారు. ఎట్టకేలకు ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా ఒకే చేయడంతో కాంగ్రెస్ వర్గాలు ఊపిరి ఆనందం వ్యక్తం చేశారు.
కాగా 211మంది అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో నామినేషన్ల పరిశీలనకు అధికారులకు చాలా సమయం పట్టింది. త్రిపుల్ ఆర్ బాధితులు, మాలమహానాడు, నిరుద్యోగులు అత్యధికంగా నామినేషన్లు వేయడం కలకలం రేపింది. అయితే నామినేషన్ల పరిశీలన అనంతరం 160 మంది అభ్యర్థులు సమర్పించిన 194 నామినేషన్లు సరిగా ఉన్నట్లు నిర్ధారించారు. మిగిలిన నామినేషన్లను తిరస్కరించినట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా నామినేషన్ల ఉపసంహరణకు మరో మూడు రోజులు సమయం ఉండటంతో మిగిలిన వారిలో ఎంతమంది బరిలో ఉంటారో తేలనుంది.
చరిత్రలో నిలిచిపోతుందా?
కాగా జూబ్లీహిల్సి ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్‌ఎస్ సిట్టింగ్‌స్థానం కావడంతో దాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తుండగా, తమ అభ్యర్థిని గెలిపించుకుని నగరంలో పట్టు సాధించాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. ఇక బీజేపీ కూడా గెలుపు కోసం ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్), ఫార్మాసిటీ భూనిర్వాసితులు, నిరుద్యోగులు. మాల మహానాడు అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. అయితే వీరిలో చాలామంది నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, ఉపసంహారణకు మరో మూడు రోజులు సమయం ఉంది. ఒకవేళ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే తాము పోటీలో ఉంటామని పలువురు చెబుతున్నారు. ఈ లెక్కన చివరికి ఎంతమంది బరిలో నిలుస్తారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం 160 మంది అభ్యర్థులు ఉండగా వీరిలో 100 మంది తప్పుకుని 60 మంది పోటీలో ఉన్నా అది చరిత్రలో నిలిచిపోతుంది. ఈవీఎం మిషన్‌లో నోటా తో కలిపి 64 అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఒకవేళ అందరూ పోటీలో ఉంటే రెండు ఈవీఎంలు అవసరం పడుతాయి. ఒకవేళ అది సాధ్యం కానీ పరిస్థితి వస్తే బ్యాలెట్ పేపర్ తప్పనిసరి అని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం పోటీలో ఉన్న అభ్యర్థులు ఉంటారా తప్పుకుంటారా మరో మూడు రోజుల్లో తేలనుంది.
Also Read: Prabhas Fauji: "మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932".. ప్రభాస్ ప్రీ-లుక్ పోస్టర్ అదిరిపోయింది👌
Follow Us