HYDRA : హైడ్రా బాధితులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆక్రమిత చెరువులు, నాలాలు, మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని సీఎ రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఔటర్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆక్రమణలకు గురి కాకుండా ఎల్లప్పుడూ పర్యవేక్షించేందుకు.. చెరువుల దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ రివర్ బెడ్ (నదీ గర్భం), బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలకు పునరావాసం కల్పించేందుకు వీటిని ఉపయోగిస్తారు. ఇప్పటికే అధికారులు చేపట్టిన సర్వే ప్రకారం 10,200 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్.. మూడు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు రేపు ఇంటింటికి వెళ్లి అక్కడున్న ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించారో తెలియజేయనున్నారు. ముందుగా రివర్ బెడ్ లో ఆక్రమణలో ఉన్న 1600 ఇళ్లను తొలగించి.. అక్కడున్న వారిని తరలించనున్నారు.
మూసీ బఫర్ జోన్ లో నివసించే వ్యక్తులు, నిర్మాణాలకు RFCTLARR చట్టం ప్రకారం పరిహారం అందించనున్నారు. నిర్మాణ ఖర్చుతో పాటు, వారికి పట్టా ఉంటే భూమి విలువను పరిహారంగా చెల్లిస్తారు. 2 BHK ఇల్లు కేటాయిస్తారు. మూసీ బాధిత ప్రజలందరికీ చట్ట ప్రకారం పునరావాసం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే భరోసా ఇచ్చారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు. ఇక నిర్వాసితులను సంప్రదించి పునరావాసం కల్పించే ప్రక్రియను కలెక్టర్లు ఈ రెండు రోజుల్లో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
Also Read : భద్రాద్రి కొత్తగూడెంలో విషాదం.. పిడుగుపాటుతో ఇద్దరు మృతి