/rtv/media/media_files/2026/02/10/fotojet-9-2026-02-10-21-07-01.jpg)
Forum for Good Governance's
Forum for Good Governance's : స్వరాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాలనలో అవినీతి భారీగా పెరిగిపోయిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చైర్మన్, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి పద్మనాభ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏ కోశాన లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు అవినీతి అధికారులపై ఏసీబీ, విజిలెన్స్ శాఖలు విచారణ జరిపి ప్రభుత్వానికి పంపిన నివేదికలపై ఇంతవరకు చర్యలు లేవని,. లంచం తీసుకుంటూ పట్టుబడిన లేక ఆశ్రిత పక్షపాతం, బంధు ప్రీతితో ప్రభుత్వానికి నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకున్న రిపోర్టులు సంవత్సరాల తరబడి ఎటువంటి చర్యలు లేక సచివాలయంలో పడి ఉన్నాయని ఆయన ఆరోపించారు. సచివాలయ ఉద్యోగస్తులు అవినీతి అధికారుల కొమ్ము కాస్తూ ఏసీబీ, విజిలెన్స్ రిపోర్టులను ఏదో ఓ వంకతో సాగదీసి చివరకు చిన్న పనిష్మెంట్ ఇచ్చి కేసు డ్రాప్ చేస్తున్నారని పద్మనాభరెడ్డి ఆరోపించారు.
కాగా రాష్ట్ర సచివాలయంలో పెండింగ్‌లో ఉన్న ఏసీబీ, విజిలెన్స్ కేసుల రెవెన్యూ శాఖలో ఎన్ని ఉన్నాయని సమాచార హక్కు చట్టం 2021 ద్వారా దరఖాస్తు చేస్తే సమాచారం ఇవ్వడానికి మొదట నిరాకరించారన్నారు. చివరగా అప్పీల్ చేయగా 27 జనవరి 2026న సమాచారం ఇచ్చారన్నారు. ఈ సమాచారం ప్రకారం రాష్ట్ర సచివాలయంలో ఏసీబీ, విజిలెన్స్ శాఖల రిపోర్టులపై తగిన చర్యలు తీసుకోవడం లేదని స్పష్టమవుతోందన్నారు. రెవెన్యూ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం వారి శాఖలోనే మొత్తం 323 ఏసీబీ కేసులు ఉంటే అందులో 5 మాత్రమే డిస్పోజ్ అయ్యాయని మిగిలిన 318 కేసులు వివిధ దశలలో పరిశీలనలో ఉన్నాయని తెలిపారన్నారు. ఈ 323 కేసులలో చాలావరకు 10 సంవత్సరాల క్రితం నమోదైన కేసులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఇక విజిలెన్స్ కేసులు మొత్తం129 ఉంటే అందులో 8 కేసులు మాత్రమే డిస్పోజ్ అయి మిగతా 121 కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపారు.
అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రతిరోజు ఏదో ఓ చోట దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. అవినీతి అధికారుల ఇళ్లు సోదాలు చేసి పెద్ద ఎత్తున డబ్బు,ఆస్తులు పట్టుకుంటున్నారు. దీనిని ప్రసార మాధ్యమాల్లో హైలైట్ చేస్తున్నారు. దీంతో ప్రజలు ఏసీబీ పనిని ప్రశంసిస్తూ అవినీతి అధికారులకు శిక్ష పడుతోందని ఇక వారికి లంచాల బెడద తప్పుతుందని భావిస్తున్నారు. కానీ లంచాలు తగ్గకపోగా ఇంకా పెరుగుతున్నాయని పద్మానాభరెడ్డి స్పష్టం చేశారు.
అవినీతి అధికారులు ఏసీబీకి ఒకటి కంటే ఎక్కువ సార్లు పట్టుబడుతున్నా వారు తమ అవినీతిని ఏమాత్రం మార్చుకోవడం లేదని ఆయన లేఖలో రాశారు. పాలనలో అవినీతి గురించి గతంలో ముఖ్యమంత్రికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సంబంధిత శాఖల కార్యదర్శులకు లేఖలు రాశామని అయితే వాటిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అందువల్ల ఏసీబీ, విజిలెన్స్ కేసులు తొందరగా పరిష్కారమయ్యేటట్లు, అవినీతి అధికారులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని పద్మనాభరెడ్డి ప్రభుత్వానికి, సీఎంకు సూచించారు.
Follow Us