Congress: గాంధీ భవన్ నుంచి జీవన్ రెడ్డి వాకౌట్.. కాంగ్రెస్ హైకమాండ్‌పై ఫైర్

కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి పార్టీ అంతర్గత వ్యవహారాలపై మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

New Update
jeevan reddy

కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి పార్టీ అంతర్గత వ్యవహారాలపై మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతల సమన్వయ సమావేశం బుధవారం జరిగింది. అయితే, సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో బయటకు వెళ్లిపోయారు. పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. సమావేశం నుండి బయటకు వచ్చిన అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరని బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఈ అధికారిక సమావేశానికి ఎలా ఆహ్వానిస్తారని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన వారిని పక్కన కూర్చోబెట్టుకుంటే, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారికి గౌరవం ఎక్కడ ఉంటుందని నిలదీశారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ అరాచకాలపై ప్రాణాలకు తెగించి పోరాడిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఇప్పుడు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "నాకు వ్యక్తిగతంగా జరుగుతున్న అన్యాయాన్ని భరించగలను కానీ, నన్ను నమ్ముకున్న వేలాది మంది కార్యకర్తలకు జరుగుతున్న అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను" అని ఆయన వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ నుండి వచ్చిన నేతలకు పెద్దపీట వేస్తూ, నిఖార్సైన కాంగ్రెస్ వాదులను విస్మరించడం సరికాదని ఆయన సూచించారు. గతంలో కూడా జగిత్యాల రాజకీయాల విషయంలో జీవన్ రెడ్డి ఇలాగే అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నిజామాబాద్ మీటింగ్‌లో ఆయన వాకౌట్ చేయడం పార్టీలో అంతర్గత కుమ్ములాటలను మరోసారి బయటపెట్టింది. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత ఇలా బహిరంగంగా విమర్శలు గుప్పించడంపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Advertisment
తాజా కథనాలు