కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడానికి రంగం సిద్ధం అవుతోందా? రేవంత్ ఢిల్లీ పర్యటన తర్వాత ఇందుకు సంబంధించిన కీలక ప్రకటన ఉంటుందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదమైన విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీ ఈ వ్యాఖ్యలను ముక్త కంఠంతో ఖండించింది. నాగార్జున, కేటీఆర్ ఆమెపై పరువు నష్టం దావా కూడా వేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి సైతం ఈ వ్యాఖ్యలు వెళ్లినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇలాంటి వ్యాఖ్యలను సహించేది లేదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: KTR: దేనితో కొట్టాలి రేవంత్.. కేటీఆర్ సంచలన ట్వీట్!
ఎమ్మెల్యేలతో వివాదం..
ఈ వివాదం ముగియక ముందే పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సురేఖ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తన వర్గీయులను అరెస్ట్ చేశారంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వాగ్వాదానికి దిగారు. సీఐ కుర్చీలో కూర్చొని రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రి హోదాలో ఉండి ఇలా చేయడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సురేఖతో తట్టుకోలేకపోతున్నామంటూ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీకి కంప్లైంట్ చేశారు. తమ నియోజకవర్గాల్లో ఆమె పెత్తానం ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు కూడా వారు ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: Revanth : వారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. మరో నాలుగు కీలక నియామకాలు!
ఈ నేపథ్యంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కూడా సురేఖను కలిశారు. అయితే.. సురేఖ ఇచ్చిన వివరణతో సీఎం సంతృప్తి చెందలేదని సమాచారం. సీఎం నేటి ఢిల్లీ టూర్ లో హైకమాండ్ తో సురేఖ వ్యవహార శైలిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీసీ మహిళను మంత్రివర్గం నుంచి తప్పిస్తే తప్పుడు సంకేతాలు వెళ్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైకమాండ్ ఇప్పటికే రేవంత్ కు సూచించినట్లు సమాచారం. మరో బీసీకి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: BIG BREAKING: ఉత్తమ్, సీతక్కకు కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు
ఇది కూడా చదవండి: CM Revanth: అపోహలొద్దు.. అన్యాయం జరగదు: వారికి సీఎం రేవంత్ భరోసా!