/rtv/media/media_files/2025/09/29/chiranjeevi-case-against-balakrishna-2025-09-29-21-07-29.jpg)
Chiranjeevi Case Against Balakrishna?
BIG BREAKING: ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యే, సీనినటుడు బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో పలువురు నటులు బాలకృష్ణ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తుండగా తాజాగా ఈ ఎపిసోడ్‌లో మరో కొత్తట్విస్ట్ నెలకొంది. బాలయ్యపై చిరంజీవి అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ రోజు హైదరాబాద్‌లో మెగా అభిమానులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బాలకృష్ణపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. కాగా ఈ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి వారిని వారించినట్లు తెలిసింది. ఫిర్యాదు వద్దు.. అది మన సంస్కారం కాదంటూ చిరంజీవి వారించారు. అయితే మరోసారి సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామని మెగా అభిమానులు స్పష్టం చేశారు.
ఈ మేరకు బ్లడ్ బ్యాంక్ సమీపంలోని ఓ హోటల్‌లో మెగా అభిమానులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.ఈ మీటింగ్‌లో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు చెందిన చిరు అభిమానులు పాల్గొన్నారు. ఈ క్రమంలో బాలకృష్ణపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని వారంతా నిర్ణయించారు. ఈ రోజు జూబ్లిహిల్స్ పీఎస్‌లో.. మంగళవారం.. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా 300 పీఎస్‌లలో ఫిర్యాదు చేయాలని అభిమానులు తీర్మానించుకున్నారు. అనుకున్నట్లుగానే జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు పయనమయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న చిరు వారికి పోన్ చేసి నిలువరించారు. చిరంజీవి పిలుపుతో ప్రస్తుతానికి ఆగాల్సి వచ్చిందంటున్న అభిమానులు తమ పోరాటం మాత్రం ఆగదని చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ నేత మోహన్ స్పష్టం చేశారు. మరో రెండు రోజుల్లో మరోసారి సమావేశం కావాలని అభిమానులు నిర్ణయించారు. తదుపరి సమావేశంలో కార్యాచరణ ప్రకటిస్తామని చిరంజీవి ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షుడు రమణస్వామి నాయుడు తెలిపారు.
అయితే సినిమా పరిశ్రమకు సంబంధించి.. గత ప్రభుత్వహయాంలో జరిగిన కొన్ని విషయాలు ఇటీవల ఏపీ అసెంబ్లీ లో చర్చకు వచ్చాయి. బీజేపీ ఎమ్మెల్యే కామినేని చేసిన కామెంట్స్‌తో మొదలైన కాక… ఇప్పుడు ఇద్దరు అగ్ర కథనాయకుల మధ్య వివాదం ముదిరే దాకా వచ్చింది. గత ప్రభుత్వం సినీపరిశ్రమపై చర్చించేందుకు.. సినిమా ప్రముఖులను తాడేపల్లికి ఆహ్వానించిందనీ.అయితే ఆ లిస్టులో బాలకృష్ణ పేరు లేదనీ బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గుర్తు చేశారు. తాడేపల్లికి వెళ్లిన సినీపెద్దలకు అవమానం జరిగితే చిరంజీవి గట్టిగా నిలదీశారని వివరించారు.
అయితే కామినేని వ్యాఖ్యలతో విభేదించిన బాలకృష్ణ ఆయన వ్యాఖ్యల పట్ల చాలా సీరియస్ అయ్యారు. చిరంజీవి నిలదీయడంతోనే జగన్ దిగివచ్చారన్న మాటలు అబద్దమన్నారు. కామినేని మాటలు సరికాదన్న బాలకృష్ణ.. చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ దిగివచ్చారన్నది శుద్ధ అబద్ధమన్నారు. ఎవరూ గట్టిగా అడగలేదంటూనే కూటమి ప్రభుత్వం కూడా FDC సమావేశం జాబితాలో కనీస గౌరవం లేకుండా, తనపేరును 9వ స్థానంలో పెట్టిందనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవిషయంలో అప్పుడే, కందుల దుర్గేష్‌కు ఫోన్ చేసి అడిగానని చెప్పారు.
అదే సమయంలో బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆయన ఈ అంశంపై సుదీర్ఘమైన ఉత్తరం విడుదల చేశారు. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను చిరు తప్పుపట్టారు. నాడు ప్రభుత్వంతో సినీ పెద్దల చర్చల సందర్భంగా ఏం జరిగిందనే విషయాన్ని వివరించారు. దీంతో ఇద్దరు అగ్రనటుల మధ్య వార్ పతాకస్థాయికి చేరింది. మరోవైపు ఈ విషయమై వైసీపీ నేతలు కూడా స్పందించారు. అనవసరంగా తమ నాయకుడి పేరు ప్రస్తావించారంటూ బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు మెగా అభిమానులు కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించడం… కీలక నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని చిరంజీవి భావిస్తున్నా.. అభిమానులు ఆగేలా లేరని స్పష్టమవుతోంది.
Also Read: Saddula Bathukamma: సద్దుల బతుకమ్మపై కన్ఫ్యూజన్.. పండితులు చెబుతున్న కరెక్ట్ డేట్ ఇదే!