/rtv/media/media_files/2025/08/12/gattu-vaman-rao-2025-08-12-12-04-32.jpg)
Vaman Rao murder
Vaman Rao : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైకోర్టు లాయరు దంపతుల హత్యపై సీబీఐ విచారణ ప్రారంభమైంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభించింది. పెద్దపల్లి జిల్లా గుంజపడుగుకు చెందిన వామన్‌రావు 2021 ఫిబ్రవరి 17న అదే జిల్లాలోని రామగిరి మండలం కల్వచర్ల సమీపంలో హత్యకు గురయ్యారు. ఆయనతో పాటు ఆయన భార్య నాగమణిని కారులో వెళుతుండగా అడ్డగించి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నాడు సంచలనంగా మారింది. ఈ కేసులో సంబంధం ఉందన్న కారణంతో మొదట కేవలం ముగ్గురిపై మాత్రమే కేసు నమోదు చేయగా విచారణ తర్వాత మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు. వారిలో ఏ1గా కుంటశ్రీనివాస్, ఏ2గా చిరంజీవి, ఏ3గా కుమార్, ఏ4గా శ్రీనివాస్, ఏ5గా లచ్చయ్య, ఏ6 గా అనిల్, ఏ7గా వసంతరావు ఉన్నారు. వారందరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించి విచారణ ప్రారంభించారు.
అయితే కేసు విచారణ విషయంలో వామన్‌రావు తండ్రి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేసును సీబీఐకి అప్పగించాలంటూ వామన్‌రావు తండ్రి కిషన్‌రావు కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ అనంతరం ఈ ఏడాది ఆగస్టు 12న సీబీఐ విచారణకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ అదే నెల 25న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. విచారణలో భాగంగా విచారణ అధికారిగా నియమితులైన ఇన్‌స్పెక్టర్ విపిన్ గహ్లోత్ బృందం పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులోని వామన్‌రావు ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా వామన్‌రావు తల్లిదండ్రులు కిషన్‌రావు, ఇంద్రసేన, సోదరుడు చంద్రశేఖర్, అక్క శారదలను విచారించి కేసుకు సంబంధించిన వివరాలను సేకరించింది. అనంతరం మంథని కోర్టుకు వెళ్లి... హత్య జరగడానికి ముందు వామన్‌రావు దంపతులు కారును పార్క్ చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. హత్య జరిగిన ప్రాంతం కల్వచెర్ల కు చేరుకుని అక్కడికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. సీబీఐ అధికారుల వెంట గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్‌తో పాటు సంబంధిత అధికారులు ఉన్నారు.
Also Read : ఆత్మగౌరవం పోయాక పదవులు ఎందుకు.. ఈటల సంచలన కామెంట్స్!