గ్రూప్ 1 అభ్యర్థులకు ఎదురుదెబ్బ తగిలింది. పరీక్షలు వాయిదా వేయాలన్న అభ్యర్థుల పిటిషన్లను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థిస్తూ గ్రూప్ 1 పరీక్షలకు లైన్ క్లియర్ చేసింది. అయితే శుక్రవారం హైదరాబాద్‌లో మరోసారి ఉద్రిక్తత చెలరేగింది. గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్, ఇందిరాపార్క్ ఏరియాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. షాపుల్లోకి వెళ్లిన అభ్యర్థులను బయటకు లాక్కొచ్చారు. అలాగే అభ్యర్థులపై లాఠీచార్జి కూడా చేశారు. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు వాయిదా వేయాలని మరోసారి ఆందోళనలు చెలరేగడం చర్చనీయాంశమవుతోంది.
Also Read: ఫుట్‌పాత్ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే!
ఇదిలాఉండగా.. ఇటీవలే గ్రూప్-1 పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రిలిమ్స్‌లో 7 ప్రశ్నలకు ఫైనల్ కీ లో సరైన సమాధానాలు ఇవ్వ లేదని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వాటికి మార్కులు కలిపి కొత్త జాబితాను విడుదల చేయాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్-1 పరీక్షలు యధాతథంగా జరుపుకోవచ్చని స్పష్టం చేసింది. ఇటీవల మెయిన్స్ పరీక్షకు సంబంధించి హాల్‌టికెట్స్ కూడా విడుదలయ్యాయి.
Also Read: Isha ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట
అయితే ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు మరోసారి నిరసనలకు దిగారు. ఈ పరీక్షల్లో రిజర్వేషన్లు పాటించడం లేదని మండిపడ్డారు. జీవో 29 ని సవరించిన తర్వాతే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రిలిమ్స్ పరీక్షల్లోని తప్పులను సవరించాలని కోరారు. బుధవారం రాత్రి అశోక్‌నగర్‌లో ఉద్రిక్త నెలకొంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు.