Telangana Municipal Elections : మున్సిపాలిటీల్లో ప్రలోభాలకు తెరలేపిన నేతలు..ఒక్కో ఓటుకు ఎంతంటే?

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రంతో తెర పడింది. ఇక రాత్రి నుంచే పలు పార్టీల నేతలు ప్రలోభాలకు తెరలేపారు. ఒక్కో ఓటుకు రూ.5 వేల వరకు పంపిణీ చేస్తుండగా, రిజర్వుడ్‌ స్థానాల్లో రూ.2 నుంచి రూ.3 వేల వరకు ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

New Update
campaign period for Bihar first phase Assembly elections concludes

Telangana Municipal Elections

Telangana Municipal Elections : తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం సాయంత్రంతో పుర ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ప్రచారానికి తెరపడినప్పటికీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. మందీమార్భాలంతో ఎంత ప్రచారం చేసినా ఓటరు ఓటు వేస్తాడన్న నమ్మకం లేదు. అందుకే ఓటర్లను మచ్చిగా చేసుకునేందుకు మిగిలిన ఈ ఒక్కరోజును పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వినియోగించుకుంటున్నారు. నిన్నటివరకు బహిరంగంగా నలుగురితో కలిసి తిరిగిన అభ్యర్థులు ఈ రోజు మాత్రం ఒకరిద్దరు అనుచరులకు తప్ప ఇతరులకు ఎవరికీ అందుబాటు లో లేకుండా పోయారు. రహాస్యంగా తిరుగుతూ తమ తమ వార్డులు, డివిజన్లలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. వారిని కలుస్తూ.. వార్డు, వ్యక్తిగత సమస్యలు పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. ఆర్థికబలం ఉన్న వారినే బరిలోకి దింపిన ప్రధాన రాజకీయ పార్టీలు నోటుతో ఎర వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. 

మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌కు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో 2,996 వార్డులు ఉన్నాయి. మొత్తం 52.43 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 25.62 లక్షలు, మహిళలు 26.80 లక్షలు, ఇతరులు 640 మంది ఓటర్లు ఉన్నారు. వీరికిగాను 8,203 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్ బూత్‌లలో బ్యాలెట్ బాక్సులు, అధికారుల నియామకం, సిబ్బంది కేటాయింపు వంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక మిగిలింది ఓటర్లను మచ్చిక చేసుకోవడం ఒక్కటే.

ఓటుకు వెయ్యినుంచి ఐదువేలు

కాగా రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో నిన్న రాత్రి నుంచే పలు పార్టీల నేతలు ప్రలోభాలకు తెరలేపారు. బలమైన ప్రత్యర్థుల మధ్య తీవ్ర పోటీ ఉన్న వార్డుల్లో ఒక్కో ఓటుకు రూ.5 వేల  వరకు పంపిణీ చేస్తుండగా, రిజర్వుడ్‌ స్థానాల్లో రూ.2 నుంచి రూ.3 వేల వరకు ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కొన్ని మున్సిపాలిటీల్లో ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు, కొడంగల్‌లో రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. పలు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రధాన పార్టీలకు దీటుగా పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.  పలు వార్డుల్లోని కాలనీల్లో గుడులు, గోపురాలకు భారీ ఎత్తున విరాళాలు ఇస్తామని ముందస్తుగా కొంత ముట్టజెప్పి ఓటు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. మిగతాది విజయం సాధించాక ముట్టజెబుతామని బాస చేస్తున్నారు. పలు వార్డుల్లో మహిళా సంఘాలకు ముందే పంపిణీ చేయాల్సిన చీరలను మహిళా సంఘాల ప్రతినిధులతో ప్రస్తుత ఎన్నికల తరుణంలో పంపిణీ చేయిస్తున్నారు. 

వారికే బాధ్యతలు

కాగా, ఆయా వార్డుల్లో అన్ని పార్టీల నాయకులు వార్డుల వారీగా మద్యం, మాంసం, నోట్ల పంపిణీకి ద్వితీయ శ్రేణి నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే పలువురు అభ్యర్థులు నగదు, బహుమతుల రూపంలో పంపిణీ చేస్తున్నారు. ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌ స్థానాలు ఆశీస్తు్న్న నేతలు తమకు అనుకూలంగా ఉన్న వార్డుల్లో పోటీ చేస్తున్న వారి మద్దతుకోసం వారి ఖర్చులు కూడా భరించడానికి వెనుకాడటం లేదు. ఆయా వార్డుల్లో పోటాపోటీగా ఖర్చు చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

పట్టించుకోని అధికారులు

కొంతమంది నేతలు ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో తమ వార్డుల్లో ఇప్పటికే రూ.5వేలు, రూ.10వేలు, కొన్ని చోట్ల వెండి నాణేలు, చీరలు, ఇతర సామగ్రిని పంపిణీ చేశారు. ఈ ప్రక్రియ మూడు, నాలుగు రోజుల నుంచి నడుస్తున్నప్పటికీ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. నోటిఫికేషన్‌ విడుదలైన నాటి నుంచి నిత్యం ఓటర్ల ఇంటికి మద్యం, మాంసం సరఫరా చేస్తూ వారిని ప్రచారానికి తిప్పుకుంటున్నారు. పలు మున్సిపాలిటీల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నా పోలీసులు కంటితుడుపు చర్యగా కొన్ని బాటిళ్లను పట్టుకుని మిగిలినవి వదిలేస్తున్నారనే ఆరోపణలు వినవస్తు్న్నాయి.

గెలిస్తే మార్చేస్తాం

కాగా మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తమ అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే పలు వార్డుల్లో అభ్యర్థులు తమ మెనిఫెస్టోలను విడుదల చేశారు, వార్డులో పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం, మరొకరు రూ.లక్ష నగదు ఇస్తామని, ఇంకొకరు పూర్తి ఖర్చు భరిస్తాం అని, సీసీ రోడ్లు, సీసీ కెమెరాలు, యువజన సంఘాల భవనాలు, తాగునీరు, అంత్యక్రియలకు ఆర్థిక సాయం అంటూ ఎవరికీ తోచిన హామీలు వారు ఇస్తున్నారు. వీళ్లు ఇచ్చే హామీలు అసలు అమలవుతాయా అనే విషయం పక్కన పెడితే గత వారం రోజులుగా మాత్రం చాలామంది తాగినంత మద్యం, రోజూ బిర్యానీ, కొంతనగదు సంపాదించుకున్నారు.

పట్టుబడ్డ నగదు

మున్నిపల్‌ ఎన్నికల వేళ పలు ప్రాంతాల్లో పోలీసులు నగదు స్వాధీనం చేసుకుంటున్నారు.ఈ రోజు హైదరాబాద్  గోషామహల్లో భారీగా  డబ్బు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పోలీసులు  తనిఖీలు చేస్తుండగా..ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు  ఎలాంటి పత్రాలు లేకుండా రూ. 76. 87 లక్షలు తరలిస్తుండగా పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకుండా నగదు తరలిస్తున్న ముగ్గురుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.  ఓటర్లకు పంపిణీ చేసేందుకు హైదరాబాద్ నుంచి జిల్లాలకు డబ్బును సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఎవరికి అనుమానం రాకుండా ద్విచక్రవాహనంపై డబ్బును తరలిస్తున్నారు. దీనితో పాటు ఇప్పటివరకు పట్టుబడిన మొత్తంలో రూ. 89 లక్షల ముప్పైవేల నగదు, 84 లక్షల 89వేల విలువై మద్యం ఉన్నాయి. అలాగే రూ. 14 లక్షల 69 వేల విలువగల గల గోల్డ్ ,సిల్వర్ లాంటి విలువైన మెటల్ వస్తువులు ఉన్నట్లు ఈసీ లెక్కలో పేర్కొన్నారు. ఇవి కాకుండా ఉచితాల కి సంబంధించిన బియ్యం, చీరెలు, ల్యాప్ టాప్స్, క్రీడా సామాగ్రి, వాహనాలు ఉన్నట్లు తెలిపారు. గడిచిన వారం రోజుల్లో అన్ని రకాలు కలిపి రూ. 2కోట్ల కు పైగా విలువ గల సోత్తును స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
 

Advertisment
తాజా కథనాలు