/rtv/media/media_files/2026/01/14/fotojet-2026-01-14t083133-2026-01-14-08-31-55.jpg)
car accident on shamshabad airport
Hyderabad : శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని ఏటీసీ రోటరీ వద్ద కారు ప్రమాదంలో ఐదు నెలల గర్భిణీ తేజస్విని తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన గంట తర్వాత కూడా అంబులెన్స్ రాకపోవడంతో, తోటి ప్రయాణికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తేజస్వినికి గర్భస్రావం అయ్యే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా పెందుర్తి మండలం రామాపురానికి చెందిన గండి గణపతమ్మ కూతురు తేజస్విని హైదరాబాద్ నగరంలో ఉంటుంది. తేజస్విని 5 నెలల గర్భవతి. అయితే సంక్రాంతి పండుగ కావడంతో ఆమెను తీసుకెళ్లడానికి నగరానికి వచ్చింది. మంగళవారం ఉదయం ఫ్లైట్‌కు వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. తెల్లవారుజామున ఎయిర్‌పోర్టుకు క్యాబ్ బుక్ చేసుకొని బయలుదేరారు. అయితే తెల్లవారుజామున 4.10 గంటలకు ఏటీసీ రోటరీ వద్దకు రాగానే కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న డ్రైవర్ సాయికేశవ, తేజస్విని, గణపతమ్మ ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. దారివెంట వెళుతున్న తోటి ప్రయాణికులు గమనించి అంబులెన్స్ కోసం పోలీసులకు, అధికారులకు సమాచారం ఇచ్చారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించాల్సిన అంబులెన్స్ సిబ్బంది ఎవరూ స్పందించలేదు. గంట గంట దాటినా అంబులెన్స్ రాలేదు. దీంతో గర్భవతి అయిన తేజస్విని తనను కాపాడాలంటూ కన్నీళ్లతో వేడుకోవడం అక్కడున్న వారిని కలచివేసింది. దీంతో స్పందించిన తోటి ప్రయాణికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్జీఐఏ పోలీసులు తెలిపారు. కాగా గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తేజస్వినికి గర్భస్రావం అయ్యే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
Follow Us