Telangana Crime : రోడ్డుపై బంగారు బిస్కెట్‌ దొరికిందంటూ బురిడీ..ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఓ మహిళ తనకు బంగారు బిస్కెట్‌ దొరికిందని దాన్ని తక్కువ ధరకే ఇస్తానంటూ ప్రజలను మోసం చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. గోల్డ్ బిస్కెట్ దొరికింది అంటూ కట్టు కథ అల్లి  మహిళను మోసం చేశారు నిందితులు. విషయం పోలీసులకు చేరడంతో వారు నిందితుల ఫోటోలు విడుదల చేశారు.

New Update
Fraud in the name of gold biscuit

Fraud in the name of gold biscuit

Telangana Crime : అత్యాశ అనర్థాలకు మూలం. మనదికానీ దానికి ఆశపడితే అడ్డంగా మునగడం ఖాయం అని మన పెద్దలు ఎప్పుడూ  చెబుతూనే ఉంటారు.  మోసపోయేవాళ్లు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్లు ఉంటనే ఉంటారు. అమాయకత్వానికి ఆశ తోడైతే అడ్డంగా బుక్కవడం ఖాయం. అలాంటిదే ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఓ మహిళ తనకు బంగారు బిస్కెట్‌ దొరికిందని దాన్ని తక్కువ ధరకే ఇస్తానంటూ కొంతమంది ప్రజలను మోసం చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. అదేదో సినిమాల్లో లాగా ఒక మహిళను మోసం చేసిన ఘటన ఖమ్మం నగరంలో కలకలం రేపింది.  గోల్డ్ బిస్కెట్ దొరికింది అంటూ కట్టు కథ అల్లి  మహిళను మోసం చేశారు నిందితులు. విషయం పోలీసులకు చేరడంతో వారు నిందితుల ఫోటోలు విడుదల చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలానికి చెందిన 55 ఏళ్ల మహిళ ఖమ్మం నగరం బోసుబొమ్మ సెంటర్‌లో నివిసిస్తోంది. ఈ నెల 20న ఆమె పాత బస్టాండు వైపునుంచి ఇంటికి నడిచి వెళ్తుంది. ఈ క్రమంలో  గాంధీచౌక్ వద్ద ఓ అపరిచిత మహిళ ఆమెను అనుచరిస్తూ వచ్చింది. ఆంధ్రాబ్యాంకు సమీపం వద్దకు రాగానే ఎవరూ లేనిది చూసి ఆ అపరిచిత మహిళ ఓ పొట్లాన్నిఆమె ముందు పడేసింది. ఆమె చూస్తుండగానే దాన్ని చేతిలోకి తీసుకుంది.  అయితే అందులో బంగారు బిస్కెట్‌ ఉండటంతో ఆమె ఆశ్చర్యం నటించింది. తనకు బంగారం బిస్కెట్ దొరికిందని నీవు కూడా చూశావు కనుక చెరిసగం తీసుకుందామని చెప్పి మహిళను నమ్మించింది.

ఈ లోపు వీరి సంభాషణ వింటున్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. వారి ద్వారా జరిగిన విషయం తెలుసుకుని దాన్ని చేతిలోకి తీసుకుని ఈ బిస్కెట్‌ పది తులాలు ఉంటుందని రూ.10లక్షలకు పైగా విలువ పలుకుతుందని నమ్మబలికాడు. దీంతో గుర్తు తెలియని మహిళ తనకు డబ్బులు అవసరం ఉన్నాయని బంగారం బిస్కట్టు తీసుకుని తనకు రూ. 5 లక్షలు ఇవ్వాలని కోరింది. అయితే ఇదంతా నిజమే  అని నమ్మిన ఆ మహిళ.. తన చేతిలో ఉన్న రూ. 10వేల నగదు, మెడలో ఉన్న సుమారు 2 తులాల బంగారపు గొలుసు తీసి అపరిచిత మహిళకు ఇచ్చింది. అయితే తనకు ఐదు లక్షలు కావాలి కనుక  మిగిలిన డబ్బు తీసుకువచ్చే వరకు తాను కేశవరావు పార్కు వద్ద కూర్చుంటానని నిందితురాలు నమ్మించింది. ఇది నిజమే అని నమ్మిన ఆ మహిళ మిగిలిన డబ్బులు తీసుకు రావడానికి ఇంటికి వెళ్లింది.  తన వెంట తీసుకెళ్లిన బంగారు బిస్కెట్‌ ను తనిఖీ చేయగా అది నకిలీ బంగారమని తేలింది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించి వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని  నిందితులు కోసం గాలించింది. కానీ వారు అప్పటికే అక్కడినుంచి పారి పోయారు. చివరికి చేసేది లేక చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన ఖమ్మం త్రీ టౌన్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా ఈ సందర్భంగా పోలీసులు ఘటన స్థలం సమీపంలో సీపీ కెమెరాల్లో రికార్డయిన చిత్రాలను సేకరించారు. వారు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని నిందితుల పోటోలు విడుదల చేశారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, కనిపిస్తే సమాచారం ఇవ్వండి అంటూ ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మెహన్ బాబు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: అయ్యో బిడ్డలు.. ఆడుకోవడానికి వెళ్లి అనంతలోకాలకు.. విషాదాంతమైన నెల్లూరు చిన్నారుల మిస్సింగ్!

Advertisment
తాజా కథనాలు