కవిత, కాళేశ్వరంతో పాటు KCR ముందున్న సవాళ్లు ఇవే!

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు బీఆర్‌ఎస్‌కు రాజకీయంగా ఇబ్బందులు సృష్టిస్తోంది. పార్టీలోని కీలక నేతలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని స్వయంగా కేసీఆరే వ్యాఖ్యానించారు.

New Update
kcr kavitha

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోవడం, పార్టీ అధినేత కేసీఆర్ ఆసుపత్రిపాలు కావడం, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడం, ఇదే సమయంలో పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం వంటివి పార్టీని డైలామాలో పడేశాయి. ఇప్పుడు ఆ పార్టీకి కష్టాలు రోజురోజుకు మరింతగా పెరుగుతున్నాయి. వీటికి తోడు పార్టీలోని కీలక నాయకుల మధ్య విభేదాలు బయటపడటం పార్టీకి మరింత తలనొప్పిగా మారింది. పార్టీలో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం కూడా పెద్ద హాట్ టాపిక్ గా మారింది. వరుస ఇంటర్వ్యూలో ఇస్తూ  పార్టీలో ఉంటూనే కీలక నేతలపై పరోక్షంగా కామెంట్లు చేయడం, ఆమె కామెంట్స్ పైన అగ్రనాయకులు ఎవరు కూడా స్పందించకపోవడం పార్టీని మరింత డ్యామేజ్ చేస్తుంది. పార్టీలో కేసీఆర్ నాయకత్వం తప్ప మరోకరు ఎవరూ లేరని, ఎవరిది కేసీఆర్ స్థాయి కాదంటూ పరోక్షంగా ఆమె కేటీఆర్ పై కామెంట్స్ చేశారు. తాజాగా  కవిత, మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మధ్య వాదోపవాదాలు వివాదాస్పదంగా మారాయి.  ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకోవడం పార్టీలో అంతర్గత గొడవలు మరింతగా పెరిగాయని సూచిస్తోంది.

రాజకీయంగా ఇబ్బందులు

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు బీఆర్‌ఎస్‌కు రాజకీయంగా ఇబ్బందులు సృష్టిస్తోంది. పార్టీలోని కీలక నేతలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని స్వయంగా కేసీఆరే వ్యాఖ్యానించారు. కేసీఆర్ తో పాటుగా హరీష్ లాంటి నేతలు అరెస్ట్ అయితే మాత్రం పార్టీ ఇరకాటంలో పడే అవకాశం ఉంది. ఇక ఇదే  రిపోర్టుపై ఉభయసభల్లో చర్చిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. ఈ నివేదికపై జరిగే చర్చలో ఆయన పాల్గొని సమాధానం చెప్పకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి చర్చకు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా అన్నది చూడాలి.

అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో పాటు, బీజేపీ కూడా బీఆర్‌ఎస్ నాయకులను తమ పార్టీలోకి చేర్చుకుంటోంది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు పార్టీని వీడుతుండటం బీఆర్‌ఎస్‌కు పెద్ద దెబ్బ అని చెప్పాలి.ఇప్పటికే గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారగా.. తాజాగా అచ్చంపేట మాజీ  ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరుతారన్న ప్రచారం నడుస్తోంది. ఆయనతో పాటుగా మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా కాషాయం పార్టీ గూటికి చేరేందుకు రెడీ అయిపోతున్నారని పొలిటికల్ సర్కిల్ లో జోరుగా ప్రచారం కూడా  సాగుతోంది.  పార్లమెంట్ ఎన్నికల తరువాత కాస్త సైలెంట్ అయిన కమలం పార్టీ ఇప్పుడు కొత్త అధ్యక్షుడితో మళ్లీ జోష్ లోకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలపైనే ఫోకస్ చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చేలా బీజేపీ వ్యహా రచనలు చేస్తుంది.  

అధికారంలో ఉన్న నేతలు కమలం పార్టీలోకి వచ్చే అవకాశం తక్కువే కాబట్టి బీఆర్ఎస్ లోని కీలక నేతలపైనే ఆ పార్టీ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ రాజీనామాల పర్వాన్ని బీఆర్ఎస్ ఆపకపోతే  పార్టీకి పెద్ద డ్యామేజ్ అనే చెప్పాలి. దీనికి తోడు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందనే వార్తలను కూడా బీఆర్ఎస్ సమర్ధవంతంగా తిప్పికొట్టడంలో విఫలమవుతుందనే చెప్పాలి. ఎమ్మెల్సీ కవిత  నుంచి ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వరకు చాలా మంది పార్టీ వీలనం అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ ముందు కవిత ఇష్యూను సాల్వ్ చేసుకోవడం, కాళేశ్వరం రిపోర్టును లీగల్ గా ఎదురుకుని నిలబడటం, బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు అడ్డుకట్టవేయడం ముందున్న సవాళ్లు మరి వీటిని బీఆర్ఎస్ ఎలా అధిగమిస్తుందో చూడాలి.  

Advertisment
తాజా కథనాలు