Harish Rao : AIG ఆస్పత్రిలో హరీష్ రావు.. ఏమైందంటే?

నిన్న పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో హరీశ్ రావు భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల నిమిత్తం ఆయన గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రికి వెళ్లారు. హౌజ్ అరెస్ట్ లో ఉండడంతో పోలీసులు కూడా ఆయన వెంట ఆస్పత్రికి వెళ్లారు.

author-image
By Manoj Varma
New Update

Harish Rao :

బీఆర్ఎస్ కీలక నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గచ్చిబౌలి AIG ఆస్పత్రికి వెళ్లారు. నిన్న అరికెపూడి గాంధీని అరెస్ట్ చేయాలని హరీష్ రావు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో ఆయన భుజానికి గాయమైంది. ఈ సందర్భంగా నొప్పితో బాధపడుతున్న వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం తన ఇంటి నుంచి ఆస్పత్రికి బయలుదేరిన హరీష్ రావును మొదటగా పోలీసులు అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హౌజ్ అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. 

ఈ క్రమంలో ఆయనకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఆస్పత్రి వరకు వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఇస్తున్నామని పోలీసులు ప్రకటించారు. ఆయన వెంట పోలీసులు సైతం ఆస్పత్రికి వెళ్లారు. దీంతో ఏఐసీ ఆస్పత్రికి వెళ్లిన హరీష్ రావుకు డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు. గాయం చిన్నదే అని తేలితే ఆయనను వెంటనే ఇంటికి పంపించే అవకాశం ఉంది.

 

ఒక వేళ పెద్దగాయమని తేలితే హరీష్ రావు అడ్మిట్ అయ్యే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ రోజు అరికెపూడి గాంధీ నివాసానికి వెళ్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రకటించడంతో ఈ చర్యలు చేపట్టారు.

నిన్న ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో సీఎం సైతం పోలీసులపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు ప్రయత్నించేవారు ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దని.. కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డీజీపీని ఆదేశించినట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు