ఎమ్మెల్యేలు అరికెపుడి,కౌశిక్ రెడ్డిల మధ్య జరిగిన గొడవతో రాష్ట్రంలో రాజకీయ వేడి నెలకొంది. హైదరాబాద్‌లో పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కోకాపేటలోని నివాసంలో మాజీ మంత్రి హరీశ్‌రావును సైతం గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. '' ఖమ్మంలో మాపై దాడి చేసింది ఎవరూ అనేది ఇంతవరకు కనిపెట్టలేదు. దాడులు చేసిన వారికి పోలీసులు రాచ మర్యాదలు చేస్తున్నారు. సీపీ కార్యాలయం వద్ద జరిగిన తోపులాటలో నా భుజానికి గాయమైంది. ఆస్పత్రికి వెళ్తానన్నా పోలీసులు ఒప్పుకోలేదు.
సీఎం రేవంత్ నోరు అదుపులోకి పెట్టుకోవాలి. పదేళ్ల పాటు గాంధీ, దానం కేసీఆర్ దగ్గరే పనిచేశారు. అప్పుడు వీళ్లు మాట్లాడిన భాషకు ఇప్పుడు మాట్లాడిన భాషకు తేడా కనిపిస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. నిన్న గాంధీనీ హౌస్ అరెస్ట్ చేసి ఉంటే ఇంత జరిగేది కాదు.గాంధీకి ఎస్కార్ట్ ఇచ్చి మరీ దాడికి పంపారు. ఇది ముమ్మాటికీ రేవంత్ చేసిన దాడే. రేవంత్ పాలన ఎమర్జెన్సీ పాలనల ఉంది.
రాష్ట్రస్థాయిలో డీజీపీ పోస్టు అత్యున్నత పోస్టు. దాన్ని దిగజార్చొద్దు. గతంలో రేవంత్‌ను హౌస్ అరెస్ట్ చేస్తే పోలీసులను అమ్మ నా బూతులు తిట్టారు. డీజీపీ.. రేవంత్ మాటలు గుడ్డిగా నమ్మొద్దు. రాహుల్ గాంధీ అమెరికాలో లెక్చర్స్ ఇస్తున్నారు. అక్కడ ఆపి నీ ప్రభుత్వ హయంలో జరుగుతున్న విషయాల మీద మాట్లాడాలి. తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు కుట్ర జరుగుతోంది. అందుకే గాంధీ , కౌశిక్ మధ్య గొడవ సృష్టించే ప్రయత్నం చేసి ....శాంతి భద్రతల వైపు డైవర్ట్ చేస్తున్నారు. పాలిటిక్స్‌ను డైవర్ట్ చేయడంలో రేవంత్ దిట్ట'' అని హరీశ్ రావు అన్నారు.