/rtv/media/media_files/2026/02/05/scam-calender-2026-02-05-19-52-34.jpg)
తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. గురువారం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి తీరు సభ్య సమాజం అసహ్యించుకునేలా ఉందని, ఆయన ఉపయోగించే భాష తెలంగాణ సంస్కృతికే మాయని మచ్చ అని విమర్శించారు.
రాజకీయాల్లో విమర్శలు సహజమని, కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాడే వికృత పదజాలం రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చుతోందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. "రేవంత్ రెడ్డి చరిత్రలో ఒక వికృత మనస్తత్వం కలిగిన 'బూతుల సీఎం'గా మిగిలిపోతారు" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిపై విషం కక్కడం రేవంత్ రెడ్డి అసూయకు నిదర్శనమని, కేసీఆర్ లేని తెలంగాణ ఊహించలేమని స్పష్టం చేశారు. రైతుల కోసం రైతుబంధు, 24 గంటల కరెంటు, వెయ్యి గురుకులాలు తెచ్చిన మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు.
జాబ్ క్యాలెండర్ లేదు.. 'స్కామ్ క్యాలెండర్' ఉంది!
నిరుద్యోగులను మోసం చేసిన రేవంత్ సర్కార్, ఏ నెలకు ఆ నెల కొత్త అవినీతికి తెరలేపుతోందని హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో నెలవారీగా చేసిన కుంభకోణాల జాబితాను ఆయన విడుదల చేశారు.
రేవంత్ రెడ్డి స్కామ్ క్యాలెండర్ విడుదల చేసిన హరీష్ రావు pic.twitter.com/XlgzC9aJrv
— Telugu Scribe (@TeluguScribe) February 5, 2026
జనవరిలో సివిల్ సప్లైస్ నుండి డిసెంబర్లో KLSR స్కామ్ వరకు వరుస క్రమంలో అవినీతి జరిగిందని ఆరోపించారు.
అమృత్ టెండర్లు, ఫోర్త్ సిటీ, లగచర్ల భూములు, సింగరేణి, పవర్ స్కామ్‌ల ద్వారా జేబులు నింపుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు.
రైతు వ్యతిరేక పాలన - వైఫల్యాల పరంపర
రుణమాఫీ, రైతుబంధు విషయంలో రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. 24 గంటల ఉచిత విద్యుత్తును 12 గంటలకు కుదించి 'ఉత్త కరెంట్'గా మార్చారని ఎద్దేవా చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులపై సీఎం చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ, బీఆర్ఎస్ హయాంలోనే 11.5 కి.మీ పనులు పూర్తయ్యాయని, ఈ రెండేళ్లలో కాంగ్రెస్ 100 మీటర్లు కూడా చేయలేదని సవాలు విసిరారు.
బీజేపీతో చీకటి ఒప్పందం
తన కుర్చీ కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకున్నారని, అందుకే కాంగ్రెస్ నేతల ఇళ్లపై దాడులు జరిగినా విచారణ ముందుకు సాగడం లేదని ఆయన ఆరోపించారు. అదానీకి తెలంగాణలో రెడ్ కార్పెట్ వేయడం ఈ ఒప్పందంలో భాగమేనని పేర్కొన్నారు.
చివరగా, "మేధావుల మౌనం రాష్ట్రానికి ప్రమాదం" అని పిలుపునిస్తూ, రేవంత్ రెడ్డి వికృత భాషను మేధావులు, ఉద్యోగులు ఖండించాలని కోరారు. హామీలు అడిగితే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని, ఇలాగే కొనసాగితే ప్రజలే రేవంత్‌ను పదవి నుండి డైవర్ట్ చేస్తారని హెచ్చరించారు.
Follow Us