/rtv/media/media_files/2025/08/05/bl-santhosh-2025-08-05-13-45-07.jpg)
కేసీఆర్‌పై బీజేపీ జాతీయ సెక్రటరీ బీఎల్ సంతోష్ రివేంజ్ మొదలుపెట్టరా అంటే అవుననే సమాధనం వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా చేయడం వెనుక బీఎల్ సంతోష్ ఉన్నట్లుగా తెలుస్తోంది. గువ్వల బాలరాజు బీజేపీలో చేరేలా బీఎల్ సంతోష్ చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. 2022లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీజేపీ, అప్పటి అధికార బీఆర్‌ఎస్ మధ్య తీవ్ర రాజకీయ వైరం కొనసాగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంతోష్ కుట్ర చేశారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం కూడా చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్టు అయిన నిందితులు, బీఎల్ సంతోష్‌తో మాట్లాడినట్లుగా కొన్ని ఆడియో, వీడియో సాక్ష్యాలను కేసీఆర్ మీడియా ముందు ప్రదర్శించారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కూడా బీఎల్ సంతోష్‌కు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. బీఆర్ఎస్ నేతలు సంతోష్ మిస్సింగ్ అంటూ హైదరాబాద్ లో పోస్టర్లు కూడా వేశారు. అయితే బీఎల్ సంతోష్ కోర్టును ఆశ్రయించి ఈ సమన్లపై స్టే తెచ్చుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం బీఎల్ సంతోష్‌ను అక్రమంగా ఇందులో ఇరికించిందని బీజేపీ నాయకులు ఆ సమయంలో ఆరోపించారు. పొలిటికల్ గా తనను ఇబ్బంది పెట్టిన కేసీఆర్ పై ఇప్పుడు బీఎల్ సంతోష్ రివేంజ్ స్టార్ట్ చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
కేసు ఏంటంటే ?
2022 అక్టోబరులో హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు (పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి) బీజేపీలో చేరేందుకు బేరసారాలు జరుపుతున్నారని ఆరోపణలు వచ్చాయి. బీజేపీకి చెందిన ముగ్గురు మధ్యవర్తులు (రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజి) ఎమ్మెల్యేలకు రూ.100 కోట్లు, వారికి సహాయం చేసినవారికి రూ.50 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ బేరసారాలకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్‌లను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందు ప్రదర్శించారు. ఈ కేసులో నిందితుల ఫోన్ సంభాషణల్లో బీజేపీ అగ్ర నేతలు బీఎల్ సంతోష్, తుషార్ వెళ్లపల్లి వంటి వారి పేర్లు ప్రస్తావనకు వచ్చాయని బీఆర్‌ఎస్ ఆరోపించింది. ప్రస్తుతం, ఈ కేసు సీబీఐ చేతిలో ఉన్నప్పటికీ, ఫోన్ ట్యాపింగ్ కేసులో వచ్చిన కొత్త ఆరోపణల వల్ల ఈ కేసు రాజకీయంగా మరింత వివాదాస్పదంగా మారింది.