/rtv/media/media_files/2025/02/11/UY1uqQNQAOXuoo3uy2uv.webp)
Local Body Elections
Local Bodies Elections : తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మరోవైపు ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి చట్టబద్ధత కల్పనకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణలతో త్వరలో ఆర్డినెన్స్ సైతం తీసుకురానుంది. అయితే మొదటి నెల రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేయాలని, ఆ తర్వాతి 2 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. రిజర్వేషన్లపై ప్రభుత్వం విధించిన గడువు రేపటితో ముగియనుంది. కానీ ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్‌లపై స్పష్టత రాలేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ఈ నెల 10న రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం గవర్నర్‌కు పంపిన ఆర్డినెన్స్‌పై రాజ్ భవన్ నుంచి స్పష్టత రావడం లేదు.
దీంతో ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ అవుతుంది? రిజర్వేషన్లు ఎలా ఉంటాయి? అనే అంశాలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీల సన్నాహాలతో స్థానిక సంస్థల ఎన్నికల రాజుకుంటున్న నేపథ్యంలో గతంతో పోల్చితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా ఉండవచ్చనేది చర్చనీయాంశంగా మారింది. గవర్నర్న్యాయనిపుణుల అభిప్రాయాలు సేకరిస్తున్నారని, ఆర్డినెన్స్‌పై నిర్ణయం తెలిపేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలిసింది. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చే అంశంపై కేంద్రం సైతం ఇంత వరకు ఎలాంటి ముందడుగూ వేయలేదు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకుల ప్రకటనలు పరిశీలిస్తే ఈ విషయం ఇప్పట్లో తేలదని స్పష్టమవుతున్నది. దీంతో రిజర్వేషన్లపై ఎప్పుడు స్పష్టత వస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.
పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం చూస్తే..అన్ని రిజర్వేషన్లు కలుపుకొని 50 శాతానికి లోబడి ఉండాలి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ప్రస్తుతం ఉన్న 22 శాతం రిజర్వేషన్లను, 42 శాతానికి పెంచి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆర్డినెన్స్ తేనుండటంతో.. అందులో పొందుపరిచే అంశాలు, బీసీ జనాభా లెక్కలు, వాటిని బట్టి మారే రిజర్వేషన్లు చర్చనీయాంశమయ్యాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వారి జనాభా ప్రాతిపదికన ఖరారు కానున్నందున వాటి విషయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చునని అంటున్నారు. అయితే రిజర్వేషన్లు మొత్తంగా మారిపోయే అవకాశం ఉందని, కాబట్టి ఎస్సీ,ఎస్టీ స్థానాలు కూడా కొంత మేరకు ప్రభావితం కావచ్చునని చెబుతున్నారు. వార్డు స్థానాలు మొదలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ అధ్యక్షులు, జడ్పీ చైర్‌పర్సన్ స్థానాల వరకు రిజర్వేషన్లలో మార్పులు జరిగే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
ఇప్పటివరకు.. గతంలో ఉన్న రిజర్వేషన్లు రెండు పదవీ కాలాల (టర్మ్‌లు) సమయం కొనసాగాయి. ఇప్పుడు ఒకే టర్మ్‌కు రిజర్వేషన్లు పరిమితం కానున్నాయి. అంటే ఈసారి నిర్ణయించే రిజర్వేషన్లు ఒక టర్మ్ మాత్రమే ఉంటాయన్న మాట. ఈ కారణంగానూ రిజర్వేషన్ స్థానాల్లో అనేక మార్పులు చోటు చేసుకోవచ్చునని అంటున్నారు.
రేపే రిజర్వేషన్ల ఖరారు?
హైకోర్టు తీర్పు ప్రకారం మొదటి నెల రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది. దీని ప్రకారం రేపటితో ఆ గడువు ముగియనుంది. అయితే గవర్నర్ ఆమోదం కానీ, కేంద్ర ప్రభుత్వ ఆమోదం కానీ ఇంతవరకు లభించలేదు. గవర్నర్న్యాయనిపుణుల అభిప్రాయాలు సేకరిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఒకవేళ అదే కనుక జరిగితే రేపు గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చు. గవర్నర్ ఆమోదం తెలిపితే రేపే రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉంది. మరోవైపు పంచాయతీరాజ్ చట్టం–2018 ను సవరించాలని కేంద్రం పై ఒత్తిడి తేవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. కానీ, అది అంత తొందరగా తేలే అంశం కాకపోవడంతో స్థానిక సంస్థలపై ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పు ప్రకారం సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున గవర్నర్ ఆర్టినెన్స్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అభ్యర్థుల వరకు రిజర్వేషన్‌ను అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే పార్టీ ప్రకారం రిజర్వేషన్లు కేటాయిస్తే కాంగ్రెస్ టికెట్లు 42 శాతం బీసీలకు లభించే అవకాశం ఉంది.