Telangana Assembly: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బిగ్ షాక్.. ఎల్లుండి నుంచి విచారణ

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలక అంశంగా మారిన ఫిరాయింపుల వ్యవహారం తుది దశకు చేరుకుంది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హతపై ఎల్లుండి నుంచి విచారణ జరగనుంది.

New Update
Jumping BRS MLAs

Jumping BRS MLAs

Telangana Assembly: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలక అంశంగా మారిన ఫిరాయింపుల వ్యవహారం తుది దశకు చేరుకుంది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హతపై ఎల్లుండి నుంచి విచారణ జరగనుంది.  అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చివరి దశ విచారణలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఆవరణలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈనెల 24 వ తేదీ నుంచి అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు విధించనున్నారు. కాగా ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల క్రాస్-ఎగ్జామినేషన్ పూర్తయిన నేపథ్యంలో, మిగిలిన ఆరు కేసులు ఈ వారంలో ముగియనున్నాయి. భారత రాజ్యాంగ పదో అనుసూచి (ఫిరాయింపు నిరోధక చట్టం) ప్రకారం స్పీకర్ విచారణలు చేస్తున్నట్లు అసెంబ్లీ అధికారులు వెల్లడించారు.

అసలేం జరిగిందంటే..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది.  బీఆర్ఎస్ పార్టీ 36 సీట్లలో విజయం సాధించి ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. అయితే బీఆర్‌ఎస్‌  టికెట్‌పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో  ఫిరాయింపు ఆరోపణలు మొదలయ్యాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. దీంతో సుప్రీం కోర్టు స్పీకర్‌ను విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు స్పీకర్‌కు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో గత సెప్టెంబర్ 29 నుంచి ఎమ్మెల్యేల విచారణలు ప్రారంభమై, అక్టోబర్ 1 వరకు మొదటి దశ పూర్తయింది. 

తొలిదశలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తదితర నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ -ఎగ్జామినేషన్ ముగిసింది. ఈ ఎమ్మెల్యేలు తమ న్యాయవాదులతో స్పీకర్ ముందు హాజరై, తాము బీఆర్ఎస్‌లోనే ఉన్నామని, ఫిరాయింపు జరగలేదని తమ వాదనలు వినిపించారు. అయితే, పిటిషనర్లైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాటికి సంబంధించిన ఆధారాలు, అఫిడవిట్లు, వీడియోలు సమర్పించారు. ఇక మిగిలిన 6 గురు ఎమ్మెల్యేల విచారణ కూడ చేయాల్సి ఉంది.  అందులో భాగంగా ఈనెల 24వ తేదీ నుంచి మిగిలిన కేసులపై  స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మౌఖిక వాదనలు విననున్నారు. ప్రతి కేసులో ఇరు వర్గాలు (పిటిషనర్లు, ప్రతివాదులు) తమ వాదనలు వినిపించనున్నారు.

Advertisment
తాజా కథనాలు