Big shock for Brs Party : కరీంనగర్‌లో గులాబీ పార్టీకి బిగ్‌ షాక్.. మేయర్‌ జంప్‌

రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో బీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. మరోవైపు హైదరాబాద్‌ మేయర్‌ , డిప్యూటీ మేయర్‌ పార్టీని వీడారు. తాజాగా కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు

New Update
 Karimnagar-Mayor Sunil rao

Karimnagar-Mayor Sunil rao

Big Shock for Brs Party: రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో బీఆర్‌ఎస్‌ వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్‌ శ్రీలత కూడా పార్టీని వీడారు. తాజాగా కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు

కరీంనగర్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ రాజకీయాల్లో పెనుసంచలనం రేగింది. కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు బీఆర్‌ఎస్‌కు గుడ్‌ బై చెప్పారు. ఆయనతో పాటు మరో పదిమంది కార్పొరేటర్లు కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వీరంతా మూకుమ్మడిగా బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్‌  సమక్షంలో శనివారం వీరంతా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండవ స్థానానికే పరిమితమైన బీఆర్‌ఎస్‌, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. అదే సమయంలో కేవలం ఒకటి రెండు స్థానాలకే పరిమితమయ్యే బీజేపీ రాష్ర్టంలో 8 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. కరీంనగర్‌ ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి లభించింది. కాగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలయ్యాక ఆ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది.10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు రాష్ర్ట వ్యాప్తంగా పలువురు మేయర్లు, కార్పొరేటర్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరలేపింది. గతంలోనూ కరీంనగర్ ఎంపీగా బండిసంజయ్‌ గెలిచినప్పటికీ స్థానిక సంస్థల్లో మాత్రం బీఆర్‌ఎస్‌ పార్టీనే తన హవా కొనసాగించింది. అయితే ఈసారి కరీంనగర్‌లో తన సత్తా చాటాలని చూస్తున్న సంజయ్‌ బీఆర్‌ఎస్‌ నేతలకు వల వేస్తున్నారు. అందులో భాగంగానే సునీల్‌రావును బీజేపీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. నిన్న మొన్నటివరకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే అంటుకునే పరిస్థితి ఉండేది. అయితే బండిసంజయ్‌ మాత్రం బీఆర్‌ఎస్‌ లోని ద్వితీయ శ్రేణి నేతలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేయడంలో సక్సెస్‌ అయ్యారు. సునీల్‌రావుకు బీఆర్‌ఎస్‌ ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ప్రచారం ఉంది. దీంతో ఆయన కొంతకాలంగా పార్టీ కార్యకలపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన బండిసంజయ్‌కు దగ్గరయినట్లు తెలుస్తోంది.

  వాస్తవానికి కరీంనగర్‌ కౌన్సిల్‌ పదవికాలం ఈనెలతో ముగియనుంది.దీంతో బీఆర్‌ఎస్‌లో ఉంటే తిరిగి గెలిచే అవకాశాలు లేకపోవడం, పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గడం వంటి కారణాలతో సునీల్‌రావు బీజేపీవైపు అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన ప్రభావాన్ని నిరూపించుకోవాలనుకుంటున్న కేంద్రమంత్రి బండి సంజయ్‌ సునీల్‌రావుకు ప్రాధాన్యత ఇస్తానన్న హామీతో ఆయన బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. కాగా సునీల్‌రావుతో పాటు మరో పదిమంది కార్పొరేటర్లు కూడా కారుదిగి కమలం పార్టీలో చేరుతున్నారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్‌ ఎలా స్పందిస్తోందో చూడాలి.

Advertisment
తాజా కథనాలు