/rtv/media/media_files/2025/11/03/tipper-2025-11-03-11-08-58.jpg)
రంగారెడ్డి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో కంకర లోడుతో అతివేగంగా వస్తున్న ఒక టిప్పర్ లారీ, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటివరకు 24 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో చేవెళ్ల-వికారాబాద్ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదానికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి.
కారణాలు ఇవే
టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం: కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్ లారీ డ్రైవర్ మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
రాంగ్ రూట్ : టిప్పర్ లారీ రాంగ్ రూట్‌లో వెళ్లింది. ఎదురుగా వస్తున్న బస్సును దాటే క్రమంలో అదుపుతప్పి బలంగా ఢీకొట్టింది.
ఇరుకైన రోడ్డు : ప్రమాదం జరిగిన NH-163 (హైదరాబాద్-బీజాపూర్ రహదారి) ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రెండు లేన్ల రోడ్డుగా ఉంది. భారీ వాహనాలు అతివేగంతో ఒకదానినొకటి దాటే క్రమంలో లేదా ఎదురెదురుగా వచ్చినప్పుడు డ్రైవర్లు అంచనా వేయడంలో కష్టం ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మార్గంలో నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులు ఆలస్యం కావడం వల్ల, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న ఈ రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది.
కంకర లోడ్ ప్రభావం: టిప్పర్ లారీలో కంకర లోడ్ ఉండటం వల్ల, ఢీకొన్నప్పుడు దాని బలంవిపరీతంగా పెరిగింది. లారీ బస్సును ఢీకొట్టిన తర్వాత కంకర లోడ్ నేరుగా బస్సులోకి దూసుకురావడం వల్ల ప్రయాణికులు తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే మరణించడం జరిగింది.
రంగారెడ్డి బస్సు ప్రమాదంపై హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నంబర్లు: 9912919545, 9440854433. ప్రయాణికుల కుటుంబ సభ్యులు, బంధువులు వీటి ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. చేవెళ్ల ప్రభుత్వఆసుపత్రిలో క్షతగాత్రులకు మంత్రి పొన్నం పరామర్శించారు.
Follow Us