Saddula Bathukamma: తొమ్మిది రోజుల పూల పండుగ చివరి ఘట్టానికి చేరుకుంది. ఎంగిలిపూలతో మొదలై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగియనున్నాయి. ఈ సద్దుల బతుకమ్మ మిగతా బతుకమ్మల కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. 8 రోజుల కంటే ఈ రోజు పేర్చే బతుకమ్మ బాగా పెద్దగా ఉంటుంది. ఈ ఏడాది అష్టమితో పాటు నవమి కలిసి ఒకే రోజు వచ్చింది. సద్దుల బతుకమ్మ సందర్భంగా వీలైనన్ని రకాల పూలతో అతిపెద్ద బతుకమ్మను తయారు చేస్తారు. పక్కన మరో చిన్న బతుకమ్మను కూడా పెడతారు. అలాగే పసుపుతో తయారు చేసిన గౌరీ దేవిని కూడా పూజిస్తారు. చివరగా గౌరమ్మను చేసిన పసుపును మహిళలంతా ముఖానికి రాసుకుంటారు. సద్దుల బతుకమ్మ ఆట చూసేందుకు ఊరంతా ఒకదగ్గరికి చేరుకుంటారు. ఉదయం లేచి మహిళలు ఇల్లు శుభ్రం చేసి అన్ని పూలను తెంపుకొస్తారు. పెద్ద తాంబూళం పల్లెం తీసుకుని పూలను పేర్చుతారు. కొందరు రౌండ్‌గా బతుకమ్మను తయారు చేస్తే మరికొందరు స్తూపంలా అమరుస్తారు. గునుగు పూలను తెచ్చి రంగులు వేస్తారు. బతుకమ్మను పూజగదిలో పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు.
ఐదురకాల నైవేద్యాలు:
సద్దుల బతుకమ్మ రోజున అమ్మవారికి ఐదు నైవేద్యాలు సమర్పిస్తారు. చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నంతో పాటు పెరుగన్నం కూడా పెడతారు. అలాగే పంచదార, కొట్టె కలిపి చేసిన లడ్డూలను అమ్మవారి ముందు ఉంచుతారు. సాయంత్రం అయ్యాక ఏ వీధి చూసినా బతుకమ్మలే చూడచక్కగా కనువిందు చేస్తుంటాయి. మహిళంతా చక్కగా అలంకరించుకుని, పట్టుచీరలు కట్టుకుని బతుకమ్మ ఆడుతారు. నృత్యాలు చేస్తూ సంతోషంలో మునిగి తేలుతారు. 9 అంతరాలు అంటే వరుసల్లో చేసే బతుకమ్మ చూసేందుకు చక్కగా ఉంటుంది. తలపై బతుకమ్మ పెట్టుకుని మహిళలంతా ఊరి మధ్యలో ఉంచి ఆడిపాడుతారు. తర్వాత చెరువులు, నదుల దగ్గరికి బతుకమ్మను తీసుకెళ్లి గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత ఇంటికి వచ్చి నైవేద్యాలను అందరికీ ప్రసాదంగా పంచిపెడతారు. ఇలా బతుకమ్మ ఉత్సవాలు ముగుస్తాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన ఈత.. తల్లిదండ్రులకు కడుపుకోత