Bathukamma: అంబరాన్నంటేలా బతుకమ్మ సంబరాలు.. ఈ సారి స్పెషల్ ఏంటో తెలుసా!?

తెలంగాణ సాంప్రదాయానికి తార్కాణమైన బతుకమ్మ పండుగను ఈసారి మరింత వైభవంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొమ్మిది రోజుల పాటు 9 రకాల వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనుంది.

New Update
Bathukamma celebrations

Bathukamma celebrations

 Bathukamma:  భారతీయ సంస్కృతి సాంప్రదాయల్లో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల ప్రత్యేకత వేరు. మిగిలిన ప్రాంతాలకు భిన్నంగా ఇక్కడి ఆచారాలు, పండుగలు, వేడుకలు ఉంటాయి.  అలాంటివాటిలో బతుకమ్మ ఒకటి. తెలంగాణ సాంప్రదాయానికి తార్కాణమైన బతుకమ్మ పండుగను ఈసారి మరింత వైభవంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొమ్మిది రోజుల పాటు జరిగే నవరాత్రుల వేడుకలకు అనుగుణంగా 9 రోజుల పాటు 9 రకాల వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనుంది.

ఈ వేడుకులకు సంబంధించి పర్యాటక శాఖ  ప్రత్యేక షెడ్యూల్‌ను నిర్ణయించింది. దానికి తుదిరూపు రాగానే పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారికంగా వివరాలను ప్రకటించనున్నారు. బతుకమ్మ పండుగను తొలిరోజున వరంగల్‌ జిల్లాలోని రామప్ప ఆలయ ప్రాంగణంలో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమైన  పర్యాటక ప్రాంతాల్లో ఈ  వేడుకలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో ‘ఫ్లోటింగ్‌ బతుకమ్మ’ పేరుతో ఒక ప్రత్యేక  కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఈసారి బతుకమ్మ వేడుకల్లో సెలబ్రిటీలతోపాటు అంతర్జాతీయ ప్రముఖులను కూడా ఆహ్వానించి వారిని భాగస్వామ్యం చేయాలని.. తద్వారా బతుకమ్మ పండుగ విశేషాలను ఆయా దేశాల్లోనూ ప్రజల దృష్టికి వెళ్లేలా చేయాలని  పర్యాటక శాఖ భావిస్తుంది.  ఇక హైదరాబాద్‌ నగరంలో ఉంటున్న ఇతర రాష్ట్రాల వారిని కూడా బతుకమ్మ ఉత్సవాల్లో భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక  బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఇంటర్‌, డిగ్రీ కాలేజీల విద్యార్ధులకు వ్యాస రచన పోటీలు నిర్వహించి, గ్రేడ్‌ల వారీగా బహుమతులు అందజేయాలని పర్యాటక శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

కాగా ఈ నెల 21 నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి.  బతుకమ్మ పండుగ ప్రతి ఏడాది మహాలయ అమావాస్య లేదా భాద్రపద అమావాస్య రోజున ప్రారంభమవుతుంది. దీన్ని తెలంగాణలో పెత్ర అమావాస్య అని కూడా పిలుస్తారు.

ఎంగిలిపూల బతుకమ్మ

తొలిరోజు పండుగను ఎంగిలిపూల బతకమ్మ అంటారు. తొలి రోజున గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి.. వంటి రకరకాల పూలతో బతుకమ్మ పేర్చి మహిళలంతా ఒకచోట చేరి ఆడిపాడుతారు. మొదటి రోజు అమ్మకు తులసి ఆకులు, వక్కలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆట పూర్తయిన తర్వాత మహిళలు ఈ ప్రసాదాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం ఆనావాయితీ.


అటుకుల బతుకమ్

ఆశ్వయుజ మాసంలో తొలి రోజైన పాడ్యమి నాడు జరుపుకొనే బతుకమ్మను 'అటుకుల బతుకమ్మ' అని పిలుస్తారు. ఈ రోజున బతుకమ్మకు ఎంతో ఇష్టమైన చప్పిడిపప్పు, బెల్లం, అటుకులు.. వంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు.


ముద్దపప్పు బతుకమ్మ

బతుకమ్మ ఆటలో మూడో రోజు విదియ నాడు అమ్మను 'ముద్దపప్పు బతుకమ్మ'గా పిలుస్తారు. మహిళలంతా ఈ రోజున ముద్దపప్పు, బెల్లం, పాలు.. మొదలైన పదార్థాలను అమ్మకు నైవేధ్యంగా ఇస్తారు.


నానబియ్యం బతుకమ్మ

తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మ ఉత్సవాల్లో నాలుగో రోజున 'నానబియ్యం బతుకమ్మ'గా పిలుస్తారు. ఈ రోజున నానేసిన బియ్యం, పాలు, బెల్లం.. వంటిప్రీతిపాత్రమైన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు.


అట్ల బతుకమ్మ

ఐదో రోజున బతుకమ్మను 'అట్ల బతుకమ్మ' అంటారు. ఈ రోజున అట్లు తయారు చేసి అమ్మకు నివేదిస్తారు. అలాగే  ఆట పూర్తయిన తర్వాత మహిళలందరూ తీసుకొచ్చిన అట్లను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు.


అలిగిన బతుకమ్మ

బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజున అమ్మవారిని 'అలిగిన బతుకమ్మ'గా పిలుస్తారు. చాలాచోట్ల దీన్ని 'అర్రెం'గా కూడా పేర్కొంటారు. ఈ రోజున బతుకమ్మ ఆడరు. ఈ రొజు ఎలాంటి నైవేద్యం కూడా తయారు చేయరు.


వేపకాయల బతుకమ్మ

బతుకమ్మ ఆటలో ఏడో రోజున బతుకమ్మను 'వేపకాయల బతుకమ్మ'గా అభివర్ణిస్తుంటారు. ఈ రోజున సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేసి నూనెలో వేయించి అమ్మకు నైవేద్యంగా పెడుతారు.


వెన్నముద్దల బతుకమ్మ

బతుకమ్మ సంబురాల్లో ఎనిమిదో రోజు 'వెన్నముద్దల బతుకమ్మ' అని పిలుస్తారు. ఈ రోజున నువ్వులు, వెన్నముద్ద, బెల్లం.. వంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు.


సద్దుల బతుకమ్మ

ఆశ్వయుజ మాసంలో ఎనిమిదో రోజైన దుర్గాష్టమి నాడు బతుకమ్మను 'సద్దుల బతుకమ్మ'గా జరుపుకుంటారు. దీన్ని 'పెద్ద బతుకమ్మ' అని కూడా పిలుస్తారు. ఈ రోజున తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ.పేరుతో రెండు బతుకమ్మలను పేరుస్తారు. హుషారైన పాటలతో మహిళలంతా ఎంతో వైభవంగా బతుకమ్మ ఆట ఆడుకుంటారు. ఈ రోజున పెరుగన్నం, చిత్రాన్నం, పులిహోర, కొబ్బరిపొడి, నువ్వులపొడి.. ఇలా ఐదు రకాల సద్దులను అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆట పూర్తయిన అనంతరం సమీపంలోని నదుల్లో  బతుకమ్మను నిమజ్జనం చేసి తెచ్చుకున్న సద్దులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. దీంతో తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జగిగే బతుకమ్మ ఉత్సవాలు ముగుస్తాయి.

Advertisment
తాజా కథనాలు