/rtv/media/media_files/2025/03/21/DWTA1xvJf916uppoMaqX.jpg)
Telangana Ration Cards
New Ration Cards : రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా కావాల్సింది ప్రధానంగా రేషన్ కార్డు. ప్రతి పేద, నిరు పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డు అనేది అవసరం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో మీసేవ సెంటర్ల ఆన్‌లైన్ చేసుకొని పౌరసరఫరాల కార్యాలయాల్లో వాటిని వెరిఫికేషన్ చేసి వెంటనే కార్డు మంజూరు చేయాలని ప్రభుత్వం చెబుతుంది.
కొత్త రేషన్ కార్డుల కోసం గత ఏడాది నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించారు. వాటి విచారణను మాత్రం పౌరసరఫరాల అధికారులు జీహెచ్ఎంసీకి అప్పగించారు. కొత్తగా కార్డు కావాలనుకునే వారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినా ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవసరం లేదంటూ అప్పట్లో అధికారులు ప్రకటించారు.
మీసేవాలో దరఖాస్తు చేయాల్సిందే..
అయితే ప్రజా పాలనలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ తాజాగా మరో సారి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో గతంలో ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న కుటుంబాలతో పాటు కొత్తగా రేషన్ కార్డు కావాలనుకునే వారు, కార్డులో మార్పులు చేర్పులు చేసుకునే వారు మీ సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు.
ఇలా దరఖాస్తు చేయండి
కొత్త రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా… జూన్ నాటికి అఫ్రూవ్ వచ్చిన వాటికి పంపిణీ పత్రాలను అందజేస్తున్నారు. అయితే కొత్తగా వచ్చే దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు. వీరికి త్వరలోనే కార్డులను పంపిణీ చేస్తారు. కాబట్టి రేషన్ కార్డు రానివాళ్లు… మీసేవా ఆన్ లైన్ కేంద్రాల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు,కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవా కేంద్రాల వద్దకు వెళ్లే వారు… అక్కడ అందుబాటులో ఉండే మీసేవా దరఖాస్తు ఫామ్ ను నింపాల్సి ఉంటుంది. అంతేకాకుండా దరఖాస్తుదారుడి ఆధార్ కార్డుతో పాటు నివాసపత్రాల(అడ్రస్ ఫ్రూప్ )ను సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తుదారుడి పత్రాలను పీడీఎఫ్ రూపంలో ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పత్రాలు లేకుండా కొత్త రేషన్ కార్డుతో పాటు పాత కార్డుల్లో మార్పులు చేసుకోవడానికి వీలు ఉండదు. సరైన పత్రాలు సమర్పించకుంటే… తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి వివరాలను సమర్పించాలి. పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల చేర్చుకునేందుకు కూడా మీసేవా అప్లికేషన్ ఫామ్ నింపాలి. అంతేకాకుండా చేర్చాల్సిన వారి ఆధార్ కార్డులు, ఇంటి చిరునామా పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. మీ దరఖాస్తు ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత… అధికారుల లాగిన్ కు చేరుతుంది. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి… మీరు అర్హులైతే మీకు కార్డు మంజూరు చేస్తారు.
అయితే రాష్ట్రంలో రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరంగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని సూచిస్తున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. అదనంగా 95 లక్షల కొత్త కార్డులు ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దీంతో పాత, కొత్త కార్డులతో కలిపి మొత్తం లబ్ధిదారుల సంఖ్య 1కోటి 84 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తోంది.