/rtv/media/media_files/2025/10/28/maoists-sikasa-leader-bandi-prakash-surrenders-2025-10-28-10-40-58.jpg)
Maoists..Sikasa leader Bandi Prakash surrenders
Maoist Leader Bandi Prakash : మావోయిస్ట్ పార్టీకి మరోసారి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అనేక మంది మావోయిస్టు కీలక నేతలు జనజీవన స్రవంతిలో కలిసిపోయిన విషయం తెలిసిందే. వీరి బాటలోనే మరి కొందరు కీలక నేతలు కూడా నడుస్తున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ ముఖ్యనేత బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ పోలీసులకు సరెండర్ అయ్యారు. ఈరోజు (మంగళవారం) తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో బండి ప్రకాష్ లొంగిపోయారు.
మావోయిస్టు పార్టీ అనుబంధ సింగరేణి కార్మిక సమాఖ్య కార్యదర్శిగా కొనసాగిన బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ తీవ్రమైన అనారోగ్యంతో లొంగిపోయినట్లుగా సమాచారం. ఇటీవల ఆయుధాలు వీడాలన్న మల్లోజుల వేణుగోపాల్ వాదనను సికాస సమర్ధించిన సంగతి తెలిసిందే. సికాస నేత అశోక్ పేరిట విడుదల చేసిన లేఖలో తొలుత మల్లోజుల వాదనను బలపరుచగా..తర్వాతా విడుదలైన మరో లేఖలో మల్లోజుల వాదనను తప్పుబట్టారు. అందులో ఏదీ అసలు లేఖ అన్నది గందరగోళాన్ని రేపింది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ముందు మల్లోజుల లొంగుబాటుకు ముందు ఆయన ఇచ్చిన ఆయుధాలు వీడుదాం అనే పిలుపుకు మూడు కమిటీలు ఆమోదం తెలపగా.. హిడ్మా, తిప్పరి తిరుపతి అలియాస్​ దేవ్​జీ నేతృత్వం వహించే కమిటీలు వ్యతిరేకించడం గమనార్హం.
జైలు నుంచి విడుదలై మళ్లీ అడవి బాట..
కాగా, మావోయిస్టు పార్టీ సీనియర్ నేతగా గుర్తింపు పొందిన బండి ప్రకాశ్ సింగరేణి కార్మికుడు. ఆయన సింగరేణి సంస్థ లోనే పని చేస్తూ అప్పటి పీపుల్స్‌వార్ ఉద్యమాలకు ఆకర్షితుడై 1980లో సింగరేణి కార్మిక సమాఖ్యలో చేరారు. 1988 లో బెల్లంపల్లిలో సీపీఐ నేత అబ్రహం హత్య కేసులో ఆయన జైలుకు కూడా వెళ్లారు. ఆదిలాబాద్ సబ్ జైలులో శిక్షను అనుభవిస్తూనే నాటి పీపుల్స్‌వార్ ముఖ్య నేతలైన నల్లా ఆదిరెడ్డి, మహమ్మద్ హస్సేన్, ముంజ రత్నయ్య గౌడ్ తదితరులతో కలిసి సబ్ జైలు గోడలను బద్దలుకొట్టుకుని పోలీసుల తుపాకులతో సహా చాకచక్యంగా తప్పించుకున్నారు. అయితే, అప్పట్లో ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. అనంతరం 1991లో మళ్లీ అరెస్ట్ అయిన బండి ప్రకాశ్ 2004లో విడుదలయ్యారు. సీఎం రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంతో జరిపిన శాంతి చర్చల సమయంలో ఆయన జనజీవితంలోనే ఉన్నారు. అనంతరం చర్చలు విఫలం కావడంతో మళ్లీ అడవి బాట పట్టారు. గత 20 ఏళ్లుగా బండి ప్రకాశ్ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు.
Follow Us